
బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. తన యాంకరింగ్ తో సుపరిచితుడైన ప్రదీప్ ఏపీ రాజధానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో సందిగ్ధంలో పడ్డాడు. దీంతో అమరావతి పరిరక్షణ సమితి ప్రదీప్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రదీప్ దిగొచ్చాడు.
తాజాగా ఓ టీవీ షోలో యాంకర్ ప్రదీప్ ఏపీ రాజధాని ఏది అంటూ ప్రశ్న అడగటం, దానికి వైజాగ్ అని సమాధానం చెప్పడంతో వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ న్యాయవివాదాల్లో ఉండటం, మరో వైపు రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అమరావతిలో ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో ప్రదీప్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.
ప్రదీప్ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలపై అమరావతి రైతులు మండిపడ్డారు. తమను కించపరిచే విధంగా ప్రదీప్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ అభ్యంతరం తెలిపారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే హైదరాబాద్ లో ప్రదీప్ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆగ్రహం నేపథ్యంలో యాంకర్ ప్రదీప్ దిగొచ్చాడు.
ఏపీ రాజధానిపై తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపాడు. తన వ్యాఖ్యలతో ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమాపణలు చెబుతున్నట్లు ప్రదీప్ తెలిపాడు. ఈ మేరకు ప్రదీప్ ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో తనకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని కేవలం నవ్వించేందుకు మాత్రమే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చాడు. దీంతో ఈ వివాదానికి తెరదింపే ప్రయత్నం చేశాడు. అయితే ప్రదీప్ వ్యాఖ్యలపై అమరావతి రైతులు ఏమంటారో చూడాల్సి ఉంది.