Kodali Nani- Perni Nani- Anil Kumar Yadav: స్వామిభక్తికి కేరాఫ్ అడ్రస్ వైసీపీ. అధినేతపై ఈగ వాలితే ఏనుగు పడినట్టు భావిస్తారు అక్కడి నేతలు. విపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా అధినేతకు సాగిలాపడతారు. చివరకు వయసు మళ్లిన వారు సైతం సాష్టంగ నమస్కారాలకు సైతం సిద్ధపడిపోతారు. మొన్న మంత్రుల ప్రమాణస్వీకారంలో ఇటువంటి ద్రుశ్యాలే వెలుగుచూశాయి. తొలి మంత్రివర్గంలో వీర విధేయత ప్రదర్శించిన వారి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం నివ్వెరపరచింది. అసలు మంత్రులుగా కొనసాగింపు ఉంటుందని భావించిన వారిని పక్కన పెట్టారు. కలలో కూడా తొలగింపు జాబితాలో ఉండరని భావిస్తున్న వారికి ఉద్వాసన పలికారు.
అసలు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డిలను తొలగిస్తారని ఎవరూ ఊహించలేదు. మిగతా 10 మందిని తొలగించినా ఆశ్చర్యం లేకున్నా.. ఆ నలుగురు విషయంలో మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయం భిన్నంగా ఉందన్నవాదన ఉంది. వారు నావాళ్లు అని తప్పించారని భావించి ఉండవచ్చేమో కానీ.. బయట మాత్రం వేరే ప్రచారం సాగుతోంది. వారికి ఒప్పించి తప్పించారని టాక్ నడుస్తోంది. ఇన్నాళ్లూ తాము ప్రదర్శించిన స్వామిభక్తిని పక్కన పడేశారన్న బాధ వారిలో ఉంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో కూడా వారు ముభావంగా ఉండడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. పనితీరు ప్రమాణికంగా తీసుకొని చేసుంటే బాధపడి ఉండేవారం కాదని..సామాజిక సమతూకంలో కూడా మమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదన్న వాదన వారితో పాటు వారి అనుచరుల్లో వినిపిస్తోంది.
Also Read: KCR: కేసీఆర్ మకాం ఇకపై ఢిల్లీలోనే.. కేంద్రంపై కోట్లాడుడేనట?
దూషణలతో కాలం వెళ్లదీసిన కొడాలి
అసలు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ లు చేసిన తప్పేంటి? వారిని ఎందుకు తొలగించారన్న చర్చ సహజంగానే వస్తోంది. అధికార పక్షంలోనూ లోతైన చర్చ నడుస్తోంది. అసలు కొడాలి నాని మంత్రిగా కాదు.. సాక్షాత్ ప్రభుత్వ పెద్దగా భావించారు. తనకు తాను బిల్డప్ ఇచ్చుకున్నారు. ఆ స్థాయిలో ఆయన విపక్షాలను టార్గెట్ చేసుకునేవారు. అందుతో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై వీరలెవల్ లో విరుచుకు పడేవారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ టాస్క్ లో ముందుండే వారు. శాఖపరమైన టాస్క్ లో వెనుకబడ్డారన్న టాక్ నడుస్తోంది. చేతిలో అతి కీలకమైన పౌరసరఫరాల మంత్రిగా ఉన్నా.. ఆయన తన శాఖపై ఎప్పుడూ సమీక్షలు చేసిన దాఖలాలు లేవు. మాట్లాడటం లాంటివి చేయలేదు. విపక్ష నాయకులపై దూషణ పర్వానికే సమయమంతా కేటాయించే వారు. హైకమాండ్ ఎలా విమర్శించమంటే అలా విమర్శించేవారు. జగన్‌పై అత్యంత విధేయత చూపేవారు. జగన్ కారు డ్రైవర్‌గా పని చేయడానికి కూడా సిద్ధమని చెప్పేవారు. అలాంటిది ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. కమ్మ సామాజికవర్గానికి మంత్రి పదవి అవసరం లేదని జగన్ భావించారని అంటున్నారు. అంత విధేయత చూపిన వాళ్లకీ కులం కోటాలోనే ప్రాధాన్యం ఇస్తారా ? సొంత మనిషిగా పక్కన పెట్టుకోలేరా ? అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా సాగుతోంది.
మీడియా ముందు తూలనాడే పేర్ని నాని
పేర్ని నాని తన శాఖతో పాటు పార్టీ స్టాండ్ ను కూడా వినిపించడంలో ముందంజలో ఉండేవారు. ప్రభుత్వ విధానాలను చెప్పడంలో, సమర్థించడంలో ఆయనకు ఆయనే సాటి. మంచి వాగ్ధాటి ఉన్న నేత కూడా. మీడియా ముందు విపక్షాలను తూలనడడంలో మంచి దిట్ట. మీడియా ప్రతినిధులు అడిగిన క్లిష్ట ప్రశ్నలకు, ఇరుకున పెట్టే నేర్పరి. ఆయనను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. వైఎస్ఆర్‌సీపీ నేతలకూ అర్థం కావడం లేదు. పేర్ని నాని తనను తాను వైఎస్ కుటుంబానికి పెద్ద పాలేరునని ప్రకటించుకున్నారు. తన సామాజికవర్గానికి కించపరిచేలా వ్యాఖ్యానాలు చేశారు. జనసేనానిపై విరుచకుపడేవారు. చిన్న పాయింట్ ను తీసుకొని పెద్దది చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. వైసీపీకి, అధినేత జగన్ కు మైలేజ్ వచ్చే ఏ విషయాన్నీ విడిచిపెట్టేవారు కాదు. అటుపార్టీకి.. ప్రభుత్వానికి తలలో నాలుకలా వ్యవహరించారు. ఆయన పదవిని ఎందుకు తప్పించారన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కని విషయం అనుకోవచ్చు. నిజానికి ఆయనకు సామాజిక సమీకరణం కూడా కలసి వస్తుంది. కానీ ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాని పరిస్థితి. కారణాలేమైనప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో తమ మార్కును చూపించిన ఇద్దరు నానీలు ప్రస్తుతం రాజకీయ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
రంకెలతో అనిల్ రచ్చ
అనిల్ కుమార్ యాదవ్ ది కూడా వింత పరిస్థితి. అధినేత ముద్దు..నాకు ఇంకెవరు వద్దు అన్నట్టు వ్యవహరించేవారు. శాఖపరమైన వైఫల్యాలను అటు విపక్షాలు, మీడియా చూపినప్పుడు రంకెలు వేసేవారు. నోటికి పని చెప్పేవారు. శాఖపరంగా ఉనికి చాటుకునే మాట అటుంచితే పార్టీ అధినేత పట్ల వీరవిధేయత ప్రదర్శించేవారు. కానీ ఉన్నట్టుండి ఆయన తొలగింపును అనిల్ కూడా ఊహించలేదు. నిన్ను తప్పిస్తాను అన్న మాట తెలిసిన నాటి నుంచే ఆయన అమరావతికి ముఖం చాటేశారు. ఇన్నాళ్లు అమాత్య ఇమేజ్ చట్రంలో ఉన్న ఆయనకు ఇన్నాళ్లకు నేల కనిపించింది. ప్రస్తుతం ఆయన నెల్లూరుకే పరిమితమవుతున్నారు. అడపాదడపా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళుతున్నారే తప్ప మాట వరసకు కూడా అమరావతి వైపు తొంగి చూడడం లేదన్న టాక్ అధికార వైసీపీలో నడుస్తోంది. మొత్తానికి తెగ వాగుడుకాయలు నాని ధ్వయంతో పాటు అనిల్ యాదవ్ కు భంగపాటు తప్పలేదు.
Also Read:KCR KTR: కేసీఆర్ మార్చమంటాడు.. కేటీఆర్ రక్షించాలంటాడు!