
Nara Lokesh- Jagan: పిల్లలకు మంచి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలని ప్రతి నాయకుడూ కోరుకుంటాడు. అయితే వారసులకు రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటేనే అది సాధ్యపడుతుంది. వారసత్వం అనేది ఒక ఎంట్రీ వరకే పనిచేస్తుంది కానీ.. జీవిత కాలం పనిచేయదన్నది చాలా మంది విషయంలో తేలిపోయింది. వారసులుగా రాజకీయ అరంగేట్రం చేసిన వారు సక్సెస్ అయిన వారూ ఉన్నారు. చతికిలపడిన వారూ ఉన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చిన లోకేష్ సక్సెస్ అవుతారా? చతికిలపడతారా? అన్నది ఆయనపై ఆధారపడి ఉంటుంది. అయితే అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు లోకేష్ ఎంట్రీ విషయంలో సరైన ప్లానింగ్ చేయలేదన్న అపవాదు ఉంది. దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి.. ఆపై మంత్రిని చేశారు. అదే ప్రత్యక్ష రాజకీయాల ద్వారా అరంగేట్రం చేయించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదన్న టాక్ అయితే మాత్రం తరచూ వినిపిస్తుంటుంది.
లోకేష్ విషయంలో అన్నీ మైనస్ లే కనిపిస్తున్నాయి అనే దానికంటే.. పనిగట్టుకొని అతడిపై రుద్దగలుగుతున్నాయి. కానీ వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు దాటాల్సిన పరిస్థితి. రాజకీయ అరంగేట్రం చేసే సమయానికి లోకేష్ ఒక మాజీ సీఎం కొడుకు మాత్రమే. రాజకీయాలతో ఎటువంటి సంబంధాలు లేకుండా చదువు, వ్యాపారాల వరకే ఆయన పరిధి ఉండేది. ఎప్పుడైతే ఆయన రాజకీయాల వైపు వచ్చారో అప్పుడే ప్రత్యర్థులకు శత్రువుగా మారారు. చంద్రబాబును ప్రత్యర్థులుగా భావించిన వారు లోకేష్ ను కూడా అదే రీతిలో చూస్తూ వస్తున్నారు. అందుకే ఏ నాయకుడు, ఏ నాయకుడు కుమారుడు టార్గెట్ అవ్వనంతగా లోకేష్ అయ్యారు. ఆయన వ్యక్తిత్వాన్ని, శరీర ఆకృతిని, చివరకు ఆయన పుట్టుకను సైతం హేళనచేసే స్థాయికి పరిస్థితి వచ్చింది. అయితే ఇదంతా చంద్రబాబు మైనస్ గానే ఎక్కువ మంది పరిగణిస్తున్నారు.
అదే జగన్ విషయంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. సరైన సమయంలో రాజశేఖర్ రెడ్డి కుమారుడ్ని పొలిటికల్ ఎంట్రీ ఇప్పించారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయించారు. అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు. అలాగని లోకేష్ అంతా విద్యావంతుడు జగన్ కాదు. పైగా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు, కేసులను ఎదుర్కొన్నారు. అయితే వాటన్నింటినీ అధిగమించి నాయకుడిగా నిలబడ్డారు. తండ్రి రాజకీయ ఉన్నతికి కారణమైన కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. తండ్రి మరణానంతరం ఆయనకు ఉన్న ఇమేజ్ ను మాత్రమే వాడుకున్నారు. ఇంకో విషయం ఏమిటంటే చంద్రబాబు ప్రత్యర్థులు లోకేష్ కు ప్రత్యర్థులయ్యారు. కానీ జగన్ విషయంలో అలా జరగలేదు. నాడు తండ్రి వైఎస్ కు ప్రత్యర్థులుగా ఉన్నవారు… జగన్ కు ప్రత్యర్థులు కాలేదు. పైగా మిత్రులుగా మారారు. అత్యంత సన్నిహితులుగా మెలుగుతున్నారు. ఇందుకు తెలంగాణ సీఎం కేసీఆరే చక్కటి ఉదాహరణ.

లోకేష్ కు పార్టీ వారసత్వం కూడా ప్రతిబంధకంగా మారింది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు హైజాక్ చేశారు. దానిని డెవలప్ చేశారు. ఓన్ చేసుకున్నారు. అదే పార్టీలో వారసుడిగా ఎదిగే క్రమంలో లోకేష్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రూపంలో పోటీని ఎదుర్కొంటున్నారు. కానీ జగన్ అలా కాదు. తమ కుటుంబానికి ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్ పార్టీతో విభేదించారు. సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఎంతగానో కష్టపడ్డారు. కానీ లోకేష్ ఆ స్థాయిలో కష్టపడుతున్నా.. ఇది నా ఓన్ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి లేదు. జగన్ కు కలిసొచ్చినట్టుగా ఏ అంశమూ లోకేష్ కు కలిసిరాలేదు. కానీ గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఒకటి మాత్రం నిజం రాజకీయాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే నాయకుడు రాటుదేలగలడు. అనుకున్నది సాధించగలడు. రాజ్యాధికారానికి చేరువకాగలడు. జగన్ విషయంలో జరిగింది అదే. ఇప్పుడు లోకేష్ వంతు వచ్చింది.