Bengaluru Weather: దేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరులో కొద్దిరోజులుగా పై పరిస్థితి నెలకొంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం.. బంగాళాఖాతంలో వరుసగా తుఫాన్లు ఏర్పడటం వల్ల బెంగళూరు నగరం గజగజ వణికి పోతుంది. బెంగళూరు మాత్రమే కాదు కర్ణాటకలోని అనేక ప్రాంతాలలో ఇదే పరిస్థితి ఉంది. గత కొద్దిరోజులుగా కర్ణాటక వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మొన్నటిదాకా 22 డిగ్రీలకు మించి పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ప్రస్తుతం అది 16 డిగ్రీలకు పడిపోయింది.. ఇక గత మూడు రోజులుగా ఈ ఉష్ణోగ్రత మరింత దారుణంగా పడిపోయింది.. చల్లని గాలులు వీస్తున్నాయి. వాటి నుంచి తట్టుకోవడానికి.. వెచ్చదనం పొందడానికి ప్రజలు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. బయటికి రావడానికి భయపడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటిన తర్వాతే తమ పనులు ప్రారంభిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న బెంగుళూరులో వాతావరణం చల్లగా మారడంతో కార్యకలాపాలు కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. ఐటీ కంపెనీలు తమ పనితీరు సమయాలను మార్చుకున్నాయి. ఉదయం షిఫ్ట్ ఉద్యోగులకు కాస్త సమయం సడలిస్తున్నాయి. చల్లని వాతావరణంలో ప్రయాణం చేసి పనిచేయడం సాధ్యం కావడం లేదని ఉద్యోగులు వాపోవడంతో కంపెనీలు ఆ నిర్ణయం తీసుకున్నాయి.
ఎందుకిలా..
గత కొద్దిరోజులుగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అందువల్లే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా చల్లని గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరికొద్ది రోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధులు, చిన్నారులు, ఆస్తమావ్యాధితో బాధపడేవారు బయటికి వెళ్ళకూడదని వివరిస్తున్నారు. బెంగళూరులో గురువారం గరిష్టంగా 22.93 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. కనిష్ట ఉష్ణోగ్రత 17.22 డిగ్రీలకు పడిపోయింది. గాలి వేగం గంటకు 44 కిలోమీటర్లు గా ఉంది. సాపేక్ష ఆర్ద్రత 44 శాతంగా ఉంది. సూర్యోదయం ఆరు గంటల 24 నిమిషాలకు నమోదవుతోంది. ఐదు గంటల 50 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. ఇక గాలిలో తేమశాతం ఏకంగా 58 వరకు ఉంది. బంగాళాఖాతంలో వరసగా తుఫాను ఏర్పడుతున్న నేపథ్యంలో ఆకాశంలో మేఘాలు ఆవిష్కృతం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు ప్రజలు బయటికి వెళ్లకపోవడం మంచిదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు..” గాలిలో తేమ అధికంగా ఉంది. చల్లని గాలులు వీస్తున్నాయి. ఇలాంటప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిది. బయటికి వెళ్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఆస్తమా వ్యాధితో బాధపడేవారు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలి. వెచ్చని దుస్తులు, కళ్ళకు గ్లాసెస్ ధరించాలి. చేతులు, కాళ్లపై చర్మం పగుళ్లు ఇవ్వకుండా లోషన్లు రాసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. చర్మ సంరక్షణ సాధ్యమవుతుందని” వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇటీవల కాలాలతో పోల్చితే.. ఈ ఏడాది చలి అధికంగా ఉందని బెంగళూరు వాసులు వాపోతున్నారు.. ఇటీవల కాలంలో ఈ తరహా చలి గాలులను తాము చూడలేదని వారు పేర్కొంటున్నారు.