
జర్నలిస్టులకు గుర్తింపు రావాలంటే అక్రిడిటేషన్లు ఎంతో ముఖ్యం. అది ప్రభుత్వం ద్వారా జర్నలిస్టు పొందే హక్కు కూడా. కానీ.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు అక్కడి జర్నలిస్టులకు కొత్తగా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేదు. కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానెళ్లు, అసలు పని లేకుండా పైరవీలతో కాలం గడిపే డూప్లికేట్ జర్నలిస్ట్ ల భరతం పట్టాలనే ఉద్దేశంతోనే అక్రిడిటేషన్ల నియమాలను కఠినతరం చేసింది వైసీపీ ప్రభుత్వం.
Also Read: ఏ అడ్డువచ్చినా దూకుడు వీడని జగన్
దీంతో అక్రిడిటేషన్ల సంఖ్యలో కోత పెట్టేశారు. మరోవైపు కమిటీ విషయంలోనూ జర్నలిస్ట్ సంఘాలను ప్రోత్సహించకుండా అధికారులకు అవకాశమిచ్చారు. దీంతో జర్నలిస్టులు పెద్ద ఉద్యమమే మొదలుపెట్టారు. కోర్టుల్లో కేసు వేయడంతో అక్రిడిటేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. దీని ఫలితంగా నెలరోజులుగా ఏపీలో జర్నలిస్టులు అక్రిడిటేషన్ల లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇక ఇప్పుడు స్థానిక ఎన్నికల సాకుతో జర్నలిస్టులు మరోసారి పావులు కదిపారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని అడ్డుకునే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఆశ్రయించారు. ఏపీలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని.. లేదా పాత వాటినైనా రెన్యువల్ చేయాలని కోరారు. ఎస్ఈసీ సహా, సమాచార శాఖ కమిషనర్‌కు కూడా జర్నలిస్ట్ సంఘాలు విన్నవించాయి.
Also Read: ఏపీలో బీజేపీ అసలు టార్గెట్ అదే..?
అయితే.. నిమ్మగడ్డను కలిసినంత మాత్రాన ఆయన కరుణిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిమ్మగడ్డను కలసిన జర్నలిస్ట్ సంఘాలన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్నవే. టీడీపీ హయాంలో సదరు సంఘాల ప్రతినిధులు ఓ వెలుగు వెలిగారు కూడా. వైసీపీ హయాంలో వీరి ఆటలు సాగడం లేదు. తీరా ఇప్పుడు అసలు గుర్తింపుకే ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి. ఈ దశలో వీరంతా ప్రభుత్వాన్ని శత్రువుగా భావిస్తున్న నిమ్మగడ్డను ఆశ్రయించారు. శత్రువుకి శత్రువు మిత్రుడు.. అనే లెక్కలో జర్నలిస్ట్ లకు నిమ్మగడ్డ అక్రిడిటేషన్లు ఇప్పిస్తారని అనుకుంటున్నారు. అయితే.. అక్రిడిటేషన్ల వ్యవహారం అంతా ప్రభుత్వం చూసుకుంటుంది. ఇందులో ఎస్‌ఈసీ పాత్ర నామమాత్రం. ఈ వ్యవహారాల్లో నిమ్మగడ్డ వేలు పెడతారా..? ఒకవేళ ఆయన పెట్టాలనుకున్నా ప్రభుత్వం ఊరుకుంటుందా చూడాలి మరి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్