
Nara Lokesh: టీడీపీలో భావి నాయకత్వంపై క్లారిటీ వచ్చిందా? లోకేష్ పరిణితి చెందారా? నాయకుడిగా టీడీపీ శ్రేణులు ఆయన్ను యాక్సెప్ట్ చేశాయా? యువగళం పాదయాత్ర ఆశయం నెరవేరిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అయితే వీటికి మిశ్రమ సమాధానాలు మాత్రమే లభిస్తున్నాయి. ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు . అనంతపురం జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. ఆదిలో ప్రభుత్వం నుంచి అవాంతరాలు ఎదురైనా.. ప్రస్తుతం మాత్రం యువగళం సాఫీగా కొనసాగుతోంది. ప్రారంభంలో తడబడినా ఇప్పుడు మాత్రం లోకేష్ కుదురుకున్నట్టు కనిపిస్తున్నారు. తనను తాను నాయకుడిగా ప్రూవ్ చేసుకునే క్రమంలో పరిణితి చెందేలా వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు వారసుడిగా..
చంద్రబాబు తరువాత టీడీపీకి ఎవరు? అన్న ప్రశ్న చాన్నాళ్ల నుంచి ఉంది. ఏడు పదుల వయసులో చంద్రబాబు ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. ఆయన తరువాత నాయకత్వ పగ్గాలు ఎవరు అందుకుంటారన్నది చాలారోజులుగా చర్చ నడుస్తోంది. 2014లో ప్రత్యక్షంగా టీడీపీలోకి ఎంటరైన లోకేష్ మంత్రి పదవి కూడా చేపట్టారు. కానీ ఆయన ఆహార్యం, మాట తీరు చూసి చంద్రబాబు రాజకీయ వారసుడిగా పార్టీ శ్రేణులే మంచి మార్కులు ఇవ్వలేదు. గత ఎన్నికల్లో తాజా మాజీ మంత్రిగా, సీఎం కుమారుడిగా ఉన్నా ఓటమి తప్పలేదు. దీంతో ఆయనపై పార్టీలో మరింత అనుమానాలు పెరిగాయి. ఒకానొక దశలో పార్టీ ఈ దశకు లోకేషే కారణమని ప్రత్యర్థులు నమ్మించగలిగారు. టీడీపీ శ్రేణుల్లో మరింత అనుమానాన్ని పెంచడంలో సక్సెస్ అయ్యారు.
ఎన్నో సందేహాల నడుమ..
ఇటువంటి దశలో లోకేష్ పాదయాత్రకు సిద్ధపడడం సహసమే. ఒక విధంగా చెప్పాలంటే ఆయన పాదయాత్ర చేయగలడా అన్న సందేహం వ్యక్తమైంది. జనం మధ్య..జనంతో పాటే ఉండి.. వారిని ఒప్పించే మాటలు, వ్యాఖ్యానాలు చేయలేడని ప్రత్యర్థులు తక్కువ అంచనా వేశారు. అంతెందుకు సొంత పార్టీ శ్రేణులే అనుమానించాయి. కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ యువగళం పాదయాత్ర సాగిస్తున్నారు. ముందుగా పార్టీ శ్రేణుల్లో తనపై ఉన్న అప నమ్మకాన్ని పోగొట్టాలని భావించారు. అందుకే పార్టీకి దగ్గరైతే తన నాయకత్వం మరింత రాటుదేలుతుందని భావించారు. పార్టీ శ్రేణులతో మమేకమవుతున్నారు. పాదయాత్రలో పార్టీపైనే ఎక్కువగా ఫోకస్ పెంచారు. క్యాండిడేట్లను డిసైడ్ చేస్తూ పార్టీలో తన పాత్ర, పరిధి పెరిగిందని శ్రేణులకు గట్టి సంకేతాలే పంపిస్తున్నారు.

అన్నీతానై చక్కబెడుతూ..
ప్రస్తుతానికి చంద్రబాబు టీడీపీ అధినేత మాత్రమే. వచ్చే ఎన్నికల్లో సీఎం క్యాండిడేట్ మాత్రమే. కేవలం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వ్యవహారాలను రిమోట్ చేసే పనిలో మాత్రమే చంద్రబాబు ఉన్నారు. కానీ లోకేష్ మాత్రం పార్టీని తన చేతుల్లో తీసుకొని నడిపిస్తున్నారు. ఇందుకు తన యువగళం పాదయాత్రనే పునాదిగా మలుచుకుంటున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు అనుసరించిన ఫార్ములానే లోకేష్ కొనసాగిస్తున్నారు. ముందుగా పార్టీలో పట్టు సాధించి సుదీర్ఘ కాలం రాజకీయం చేయాలన్నది లోకేష్ ప్లాన్. అందుకు తగ్గట్టు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ప్రజల కంటే టీడీపీ శ్రేణుల నమ్మకం కోసమే తెగ ఆరాటపడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.