
Rohit Sharma: స్టార్ క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మ పై కోర్టులో ఫిర్యాదు నమోదైంది. ఓ సామాజిక కార్యకర్త అతనిపై ఫిర్యాదు చేశారు. ఇది కాస్త క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఐపిఎల్ మూడ్ లో ఉన్న రోహిత్ శర్మకు ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశంగా పలువురు చెబుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ హుషారుగా సాగుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత మంగళవారం మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీపై అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన రోహిత్.. ఈ సీజన్ లో జట్టుకు తొలి విజయాన్ని అందించి పెట్టాడు. దీంతో రెండు ఓటములు తరువాత ముంబై జట్టు విజయాల బాట పట్టింది. దాదాపు రెండేళ్ల నుంచి పూర్తిగా తడబడుతున్న రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్ లో టచ్ లోకి రావడంతో ముంబై జట్టు ఊపిరి పీల్చుకుంది. ఈ మ్యాచ్ లో రోహిత్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. ఇటువంటి తరుణంలో రోహిత్ శర్మకు ఇబ్బంది కలిగించే విషయం ఒకటి బయటకు వచ్చింది. రోహిత్ శర్మ పై ఓ వ్యక్తి కేసు ఫైల్ చేశాడు. ఇది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోహిత్ శర్మ పై కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది..? ఆ కేసు ఏమిటి అంటూ అభిమానులు తెగ ఆందోళన చెన్నడుతున్నారు.
టీమిండియా క్రికెటర్లు ఆటనే కాదు చేసే ప్రతి పనిని కూడా ఎంతోమంది గమనిస్తూ ఉంటారు. సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులకు గురి కావాల్సిందే. అటువంటి ఇబ్బందికర పరిస్థితి తాజాగా రోహిత్ శర్మకు ఎదురయింది. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటూ బీహార్ లోని ముజఫర్ పూర్ కు చెందిన సామాజిక కార్యకర్త తమన్నా హస్మీ కోర్టులో ఫిల్ వేశారు. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగోలీ, హీరో అమీర్ ఖాన్ తదితరులపై కోర్టులో పిల్ వేశారు. ప్రస్తుతం గ్యాంబ్లింగ్ యాప్స్ ని పబ్లిక్ గానే ప్రమోట్ చేస్తున్నారని తన కంప్లైంట్ లో ఆయన పేర్కొన్నారు.

దేశ యువతను పక్కదారి పట్టించేలా ప్రమోషన్..
టీమిండియా క్రికెటర్లు దేశ యువతని పక్కదారి పట్టించేలా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారంటూ సదరు వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆకర్షణీయమైన ప్రైజులతో యూత్ ని మాయలో పడేస్తున్నారని, ఇలా చేసుకుంటూ పోతే యువత వీటికి బానిసలుగా మారిపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెటర్లు, సినిమా స్టార్లు.. పలు గేమ్ షోలను ప్రమోట్ చేస్తున్నారని, ఐపీఎల్ లోని కొన్ని జట్లను ప్రోత్సహించేలా ఇలా చేస్తున్నారని అందులో ఆయన పేర్కొన్నారు. కొందరు బహుమతులు గెలుచుకోవచ్చేమో గాని చాలామంది మాత్రం ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ కు బానిసలుగా మారిపోతున్నారని సదరు సోషల్ వర్కర్ తమన్న హస్మి తన పిల్ లో పేర్కొన్నారు. ఈ పిల్ పై కోర్టులో విచారణ ఈనెల 20న జరగనుంది. ఇదంతా చూస్తుంటే కాస్త సీరియస్ గానే కనిపిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. ఏమాత్రం అటు ఇటు అయినా సరే రోహిత్ శర్మతో పాటు సదరు సెలబ్రిటీలపై పోలీసులు కేసు పెట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదని పలువురు పేర్కొంటున్నారు. క్రికెటర్లు, స్టార్ హీరోలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల యువతపై ప్రభావం ఉంటుందని, ఎక్కువ మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.