దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో టీఆర్ఎస్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకూ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఉన్న గులాబీ పార్టీ పునాదులు కదులుతున్నాయనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం ఊహించని విధంగా వికసించడంతో.. ఇక, టీఆర్ఎస్ కు కష్టకాలమే అని అనుకున్నారంతా. బీజేపీ నేతలైతే.. అధికారానికి కేవలం అడుగు దూరంలో ఉన్నామని చెప్పుకున్నారు. కొంతకాలం ఆ జోరు కొనసాగించారు కూడా. అయితే.. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయఢంకా మోగించడం.. ప్రతిష్టాత్మకమైన సాగర్ ఉప ఎన్నికలోనూ గెలుపు జెండా ఎగరేయడంతో టీఆర్ఎస్ కు ఇప్పట్లో వచ్చిన ఇబ్బందేమీ లేదని అనిపించుకున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితి గులాబీ పార్టీకి అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. ఇలాంటి కండీషన్లో ఈటల రాజేందర్ ఎపిసోడ్ వచ్చింది. త్వరలో ఆయన రాజీనామా చేయడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.
ఆయన రిజైన్ చేస్తారా? టీఆర్ఎస్ నేతలే బయటకు పంపిస్తారా? అనే విషయమై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే.. మొత్తానికి హుజూరాబాద్ కు ఉప ఎన్నిక రావడం ఖాయమని అందరూ తేల్చేస్తున్నారు. నిజానికి అది అనివార్యం అని కూడా భావించొచ్చు. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏ విధమైన స్టెప్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఒప్పందాలన్నీ కుదిరి ఈటల బీజేపీలో చేరితే.. ఆయన ఆ పార్టీ నుంచే బరిలోకి దిగుతారు. లేదంటే.. ఇండిపెండెంట్ గా పోటీచేస్తారనే అభిప్రాయం బలంగా ఉంది. ఈటలను సాధారణంగా తీసుకునే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయి, ఈటల గెలిస్తే మాత్రం ఆ లెక్క ఖచ్చితంగా వేరే విధంగా ఉంటదని చెప్పొచ్చు. మరోసారి టీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం జోరందుకుంటుంది.
మరి, ఇలాంటి నేపథ్యంలో అసలు కేసీఆర్ ఉప ఎన్నికను కోరుకుంటారా? ఉప ఎన్నికకు అవకాశం ఎంత మేర ఉంటుంది? అన్నది ప్రధాన అంశంగా మారింది. ప్రశాంతంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నిక పెట్టుకొని లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటారా? అనే చర్చ కూడా సాగుతోంది. మరి, ఏం జరుగుతుంది? కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారు? అన్నది చూడాలి.