Coromandel Express Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటికే 207 మంది మరణించగా.. మరికొంతమంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రైలు బోగీల్లో చాలా మంది చిక్కుకోవడంతో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును కోల్ కతా నుంచి చెన్నై చెన్నై వెళ్తున్న కొరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొరమాండల్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. దేశంలో ఇలాంటి రైలు ప్రమాదాలు కొత్తేమీ కాదు. కానీ మరోసారి పునరావృతం కాకుండా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నారు. ఇందులో భాగంగా మోదీ ప్రభుత్వం రైల్వే విభాగంలో కొత్త ఆవిష్కరణలు చేసింది. ఒకే పట్టాలపై రెండు రైళ్లు ఢీకొనకుండా టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు ఇప్పటికే తెలిపింది. అదే ‘కవచ్’.
ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ఉన్నప్పుడు అవి ఢీకొనకుండా కేంద్ర రైల్వే శాఖ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. 2022 సంవత్సరంలో రూ.400 కోట్ల నిధులతో దీని అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. 2024 కల్లా దేశంలో రద్దీగా ఉండే రైల్వే లైన్లలో దీనిని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం దీనికి ‘కవచ్’ అని పేరు పెట్టింది. కవచ్ అంటే రక్షణ అని అర్థం. రైల్వే శాఖలో రైళ్లు, ప్రయాణికుల రక్షణ కోసం దశలవారీగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని సంకల్పించింది.
దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటికే 1,455 కిలోమీటర్లలో ‘కవచ్’ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు ఉన్నప్పుడు ముందుగానే హెచ్చరించి లేదా ఆటోమెటిక్ బ్రేక్ పడుతుంది. రైలు ఇంజన్ లోని క్యాబ్ లో సెట్ చేసిన స్క్రీన్ పై ముందుగానే సిగ్నల్ చూపిస్తుంది. దీంతో రైలు వేగాన్ని ఫైలెట్ తగ్గిస్తారు. ఇదే పట్టాలపై మరో రైలు ఉందని తెలిస్తే జాగ్రత్త పడుతారు.
మరి బాలేశ్వర్ జిల్లాలో ఈ రైలు ప్రమాదం ఎందుకు జరిగినట్లు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారులు స్పందించలేదు. ఈ రూట్ లో ఆ టెక్నాలజీని ఇంకా అభివృద్ధి చేయలేదని తెలుస్తోంది. లేదా.. అధికారులు కవచ్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారా? అని కొందరు విమర్శిస్తున్నారు. ప్రతీసారి ప్రవేశపెట్టె బడ్జెట్ లో కవచ్ కు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. సాధ్యమైనంతతొందరగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. మరి కవచ్ పై ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.