Coromandel Express Accident: వెలికితీస్తున్నా కొద్దీ మృతదేహాలు: మాటలకందని “కోరమాండల్” విషాదం

తిరగబడ్డ కోచ్ ల్లో చిక్కుకుపోయి, ఇరుక్కుపోయి.. కాళ్లు, చేతులు తెగి కాపాడాలంటూ హృదయ విదారకంగా ప్రయాణికులు చేస్తున్న ఆర్తనాదాలు, విరిగిపడిన బోగిలతో ఆ ప్రాంతం మొత్తం భీతవాహంగా మారింది.

Written By: K.R, Updated On : June 3, 2023 11:14 am

Coromandel Express Accident

Follow us on

Coromandel Express Accident: పట్టాల మీద పరుగులు తీయాల్సిన రైలు బోగీలు తిరగబడ్డాయి. కంటి నిండా కునుకు తీస్తూ ప్రయాణం సాగించాల్సిన వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తెగిపడ్డ చేతులు, విరిగిపడ్డ కాళ్లు, చిద్రమైన దేహాలు.. ఇది మాటలకందని విషాదం. భారతీయ రైల్వే చరిత్రలో కనివిని ఎరుగని ప్రమాదం. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో ఇప్పటికైతే 230 మంది మృతదేహాలు వెలికి తీశామని చెబుతున్నారు. ఇంకా సహాయక చర్యలు వేగవంతమవుతున్న కొద్ది ఎంతమంది మృతులు వెలుగులోకి వస్తారో తెలియదు.

ప్రమాదం ఇలా జరిగింది

పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ ప్రాంతం నుంచి చెన్నై సెంట్రల్ స్టేషన్ కు ప్రయాణిస్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్(12841) శుక్రవారం రాత్రి 7:20 నిమిషాల సమయంలో పట్టాలు తప్పి గూడ్స్ రైలు ఢీ కొట్టింది. దాదాపు 15 కోచ్ లు పట్టాలు తప్పాయి. వాటిలో ఏడు తిరగబడిపోయాయి. వాటిలో కొన్ని పక్కనే ఉన్న మరో ట్రాక్ పై పడ్డాయి. ఆ రెండో ట్రాక్ మీదగా హౌరా వెళ్తున్న బెంగళూరు_ హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12864) ట్రాక్ పై పడి ఉన్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ కోచ్ లను ఢీకొంది. ఆ తాకిడికి బెంగళూరు_ హౌరా ఎక్స్ ప్రెస్ కు చెందిన నాలుగైదు బోగీలు పట్టాలు తప్పాయి. తిరగబడిపోయిన బోగిల కింద వందల మంది చిక్కుకుపోయారు. వాటి కింద నుంచి దాదాపు 230 పైచిలుకు మృతదేహాలను వెలికి తీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు ఊపందుకున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో 400 మంది పైగా గాయపడ్డారని సమాచారం.

ఆర్తనాదాలు

తిరగబడ్డ కోచ్ ల్లో చిక్కుకుపోయి, ఇరుక్కుపోయి.. కాళ్లు, చేతులు తెగి కాపాడాలంటూ హృదయ విదారకంగా ప్రయాణికులు చేస్తున్న ఆర్తనాదాలు, విరిగిపడిన బోగిలతో ఆ ప్రాంతం మొత్తం భీతవాహంగా మారింది. సహాయక చర్యలకు చీకటి అడ్డంకిగా మారడంతో.. క్షతగాత్రులను బోగీల నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించడం కష్టంగా మారింది. కాగా కోరమాండల్, బెంగళూరు_ హౌరా ఎక్స్ ప్రెస్ లలో ఏది తొలుత పట్టాలు తప్పి ప్రమాదానికి గురైందనే విషయంపై రెండు కథనాలు వినిపించాయి. తొలుత కోరమాండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ ను ఢీకొన్నట్టు వార్తలు వచ్చాయి. తొలుత పట్టాలు తప్పింది బెంగళూరు_ హౌరా అంటూ ఒక జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. కానీ మొదట పట్టాలు తప్పింది కోరమాండల్ అని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

ముమ్మరంగా సహాయక చర్యలు

ప్రమాదం గురించి తెలియగానే జాతీయ విపత్తు స్పందన దళాలకు చెందిన నాలుగు బృందాలు.. ఒడిశా విపత్తు స్పందన దళాలకు చెందిన నాలుగు యూనిట్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ రెండు విభాగాలు చెందిన 600 మందికి స్థానికులు కూడా తోడై బోగిల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడం ప్రారంభించారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 50 మంది వైద్యులను, క్షతగాత్రుల తరలింపుకు 115 అంబులెన్సులు రప్పించారు. గాయపడిన వారిలో 47 మందిని బాలాసోర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు, 132 మందిని సమీపంలోని ఉన్న సోరో, గోపాల్ పూర్, ఖంట పాండ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యలను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మంత్రి ప్రమీల వుమాలిక్, స్పెషల్ రిలీఫ్ సెక్రటరీ సత్యవ్రత సాహూ పర్యవేక్షిస్తున్నారు.మరో వైపు మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షలు పరిహారంగా ఇస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తీవ్ర గాయాల పాలయిన వారికి రెండు లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 50 వేలు ఇవ్వనున్నట్టు ఆయన వివరించారు. ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరా తీశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని రైల్వే శాఖ మంత్రి ని ఆదేశించారు. ఈ రైలు చెన్నైకి ప్రయాణించే క్రమంలోనే ప్రమాదానికి గురి కావడంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే స్పందించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. రైలులో ప్రయాణిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారిని కాపాడేందుకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎస్ ఎస్ శివశంకర్, మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులను ఆయన ఒడిశా పంపించారు. సహాయక చర్యలో పాలుపంచుకోవాలని ఆదేశించారు. మరోవైపు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా దీనిపై వేగంగా స్పందించింది. ఆ రాష్ట్ర మంత్రి మానస్ భునియా, ఎంపీ డోలా సేన్ నేతృత్వంలోని ఒక బృందాన్ని ఒడిశా రాష్ట్రానికి పంపుతున్నట్టు ప్రకటించింది. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.