కేసీఆర్ ను వణికించేలా తీన్మార్ మల్లన్న ఏంచేశాడు?

తీన్మార్‌‌ మల్లన్న.. ఈ పేరు వింటేనే ప్రభుత్వం గుండెల్లో మరోసారి రైళ్లు పరిగెత్తే పరిస్థితి వచ్చింది. గత నాలుగు రోజులుగా ఎమ్మెల్సీ కౌంటింగ్‌ సందర్భంగా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన అభ్యర్థి. మల్లన్న ఓ సామాన్య జర్నలిస్టు. అతనొక వేతన జీవి. తన కుటుంబమే ఆదరువు. సొంత యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించి.. తెలంగాణ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న సోషల్‌ మీడియా స్టార్‌‌. కేసీఆర్‌‌పై.. ఆయన పాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న వ్యక్తి. అలాంటి ఓ సామాన్య […]

Written By: NARESH, Updated On : March 21, 2021 12:05 pm
Follow us on

తీన్మార్‌‌ మల్లన్న.. ఈ పేరు వింటేనే ప్రభుత్వం గుండెల్లో మరోసారి రైళ్లు పరిగెత్తే పరిస్థితి వచ్చింది. గత నాలుగు రోజులుగా ఎమ్మెల్సీ కౌంటింగ్‌ సందర్భంగా అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన అభ్యర్థి. మల్లన్న ఓ సామాన్య జర్నలిస్టు. అతనొక వేతన జీవి. తన కుటుంబమే ఆదరువు. సొంత యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించి.. తెలంగాణ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న సోషల్‌ మీడియా స్టార్‌‌. కేసీఆర్‌‌పై.. ఆయన పాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న వ్యక్తి.

అలాంటి ఓ సామాన్య జ‌ర్నలిస్ట్ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, తెలంగాణ ఉద్యమ శిఖ‌ర స‌మానుడైన కోదండ‌రాం లాంటి మ‌హామ‌హుల‌ను కాద‌ని.. తెలంగాణ అధికార పార్టీ అభ్యర్థికి చివ‌రి వ‌ర‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్లన్న పోరాటానికి ఇప్పుడు అందరూ సలామ్‌ చెప్తున్నారు. జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్‌కు రోల్ మోడ‌ల్‌గా నిలిచి, ట్రెండ్ సెట్టర్‌‌గా నిలిచిన తీన్మార్‌‌ మల్లన్నకు బ్రహ్మరథం పడుతున్నారు. కేవ‌లం మూడు శాతం ఓట్ల తేడాతో న‌ల్గొండ ప‌ట్టభద్రుల స్థానాన్ని మ‌ల్లన్న కోల్పోయారు. ఆర్థిక‌, అధికార‌, అంగ బ‌లం పుష్కలంగా క‌లిగిన టీఆర్ఎస్ అభ్యర్థి ప‌ల్లా రాజేశ్వర‌రెడ్డికి తీన్మార్ మ‌ల్లన్న ఏ స్థాయిలో చుక్కలు చూపించారో అందరం చూశాం.

ప్రధాన పార్టీల మాదిరి ఆయనకు బూత్‌స్థాయి కార్యకర్తలు సైతం లేరు. అంగ, అర్థ బలాలూ లేవు. ఉన్నదల్లా సోషల్‌ మీడియా. దానినే ఆధారంగా చేసుకొని సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. తన యూట్యూబ్‌ చానల్‌ను నమ్ముకొని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగా.. ఈ స్థాయి అభిమానాన్ని చురగొనడాన్ని ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు. బహిరంగంగా టీఆర్‌‌ఎస్‌ గెలిచినా.. నైతిక విజయం మాత్రం మల్లన్నదేనని ముక్తకంఠంతో అంటున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్‌‌ గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి వచ్చారు మల్లన్న. ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇదే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగారు. 10 వేల ఓట్లు మాత్రమే పొందగలిగారు ఆ సమయంలో. అలాగే 2019లో హుజూర్‌‌నగర్‌‌ ఉప ఎన్నికలోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. నాలుగు నెలలుగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజల్లోకి వెళ్లారు. స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ప్రజలను చైతన్యవంతం చేశారు. దీంతో కొంత ఆయనపై సానుభూతి పెరిగింది.

ఎన్నికల సరళిని పరిశీలిస్తే చాలా వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓట్లు వేసిన వారిలో ఎక్కువ మంది మల్లన్నకు ద్వితీయ ప్రాధాన్య ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆలేరు, భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో ఆయనకు భారీగా ఓట్లు పడ్డాయని తెలిసింది. మొత్తంగా మల్లన్న తెగువ.. మల్లన్న పట్ల ఉన్న సానుభూతికి పట్టభద్రులు స్వతహాగా వచ్చిఈ ఓట్లు రాల్చారు. ఈ ఎన్నికల్లో ఓడినా.. ఆల్‌ ద బెస్ట్‌ ఫర్‌‌ యువర్‌‌ బ్రైట్‌ ఫ్యూచర్‌‌ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.