Weather : తెలంగాణకు భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి(February)లోనే తన సెక చూపించిన భానుడు.. మార్చిలో మరింత మండనున్నాడు. ఈమేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 2వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈమేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అల్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఫిబ్రవరి 28(శుక్రవారం) భద్రాచలంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి 2వ తేదీ నుంచి రాష్ట్ర మంతటా 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. దీంతో వేడిగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో 15 డిగ్రీల వరకు నమోదు కావాల్సిన రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకు నమోదయ్యాయి. మార్చి 2 నుంచి 25 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్(Hyderabad)తోపాటు ఆదిలాబాద్, మంచిర్యాల, నారాయణ్‌పేట్, రాజన్న సిరిసిల్ల జిల్లాలతోపాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read : వేడెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఎందుకిలా..!
వాతావరణం ఇలా..
వాతావరణం వేడిగా, పొడిగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో కొన్ని జిల్లాలో వేడిగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకుపైగా నమోదవుతాయని వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకుపైగా నమోదవుతాయని పేర్కొంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శనివారమే పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతుందని అంచనా వేసింది. మధ్యాహ్నం వేళల్లో ఎండ వేడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
వేసవికి ముందే ఎండలు..
ఈసారి ఎండలు ఫిబ్రవరి నుంచే దంచి కొడుతున్నాయి. ఎండాకాలంలో ఇంకా మొదలు కాకుండానే భానుడు ఠారెత్తిస్తున్నాడు. గత 124 ఏళ్లలో అత్యంత వేడిమి ఫిబ్రవరిగా కొత్త రికార్డు నమోదు చేసింది. గత నెలలో సగటు ఉష్ణోగ్రత∙22 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. 1901 తర్వాత ఫిబ్రవరిలో ఈమేరకు సగటు ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. చరిత్రలోనే తొలిసారిగా ఈ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. 2023 ఫిబ్రవరి నెలకొల్పిన రికార్డును కూడా గత నెల దాదాపుగా అధిగమించింది. దీనిపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా వరుణుడు కరుణిస్తే తప్ప వచ్చే మూడు నెలలు ప్రచండమైన ఎండలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Also Read : వాతావరణంలో ఆకస్మిక మార్పు వస్తే ఎంత ప్రమాదకరమో తెలుసా? మానసిక రోగులు కూడా పెరుగుతున్నారా?