ఏపీ vs తెలంగాణ.. జలవివాదాల్లో తప్పు ఎవరిది?

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కొన‌సాగుతున్న జ‌ల వివాదం.. మ‌రోసారి తీవ్ర‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అక్ర‌మ ప్రాజెక్టులు నిర్మిస్తోంద‌ని కృష్ణాబోర్డుకు లేఖ రాసింది తెలంగాణ స‌ర్కారు. అంతేకాదు.. ఇందుకు సంబంధించిన సాక్ష్యాల‌ను వీడియోల రూపంలో అందించింది. దీన్ని ఆధారంగా చేసుకొని టీఆర్ఎస్ నేత‌లు ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీంతో.. జ‌ల జ‌గ‌డం మ‌ళ్లీ మొద‌లైందా? అనే చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ.. ఇందులో త‌ప్పు ఎవ‌రిది అన్న‌ది ప్రధాన ప్రశ్న. రాయలసీమ ఎత్తిపోతల.. పోతిరెడ్డి […]

Written By: Bhaskar, Updated On : June 23, 2021 11:32 am
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య కొన‌సాగుతున్న జ‌ల వివాదం.. మ‌రోసారి తీవ్ర‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అక్ర‌మ ప్రాజెక్టులు నిర్మిస్తోంద‌ని కృష్ణాబోర్డుకు లేఖ రాసింది తెలంగాణ స‌ర్కారు. అంతేకాదు.. ఇందుకు సంబంధించిన సాక్ష్యాల‌ను వీడియోల రూపంలో అందించింది. దీన్ని ఆధారంగా చేసుకొని టీఆర్ఎస్ నేత‌లు ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీంతో.. జ‌ల జ‌గ‌డం మ‌ళ్లీ మొద‌లైందా? అనే చ‌ర్చ సాగుతోంది. ఇంత‌కీ.. ఇందులో త‌ప్పు ఎవ‌రిది అన్న‌ది ప్రధాన ప్రశ్న.

రాయలసీమ ఎత్తిపోతల.. పోతిరెడ్డి పాడు విస్త‌ర‌ణ ప‌నుల‌కు సంబంధించిన వీడియోల‌ను తెలంగాణ స‌ర్కారు కృష్ణా బోర్డుకు పంపించింది. ఎన్జీటీ స్టే విధించినా.. ప‌నులు కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని, ఇంత జ‌రుగుతున్నా కృష్ణాబోర్డు అడ్డుకోలేక‌పోయింద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేసింది. అయితే.. వాస్త‌వం కూడా ఇదే అని తెలుస్తోంది. ఎన్జీటీ స్టే విధించిన మాట వాస్త‌వం. అయిన‌ప్ప‌టికీ.. అక్క‌డ ప‌నులు కొన‌సాగుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు వీడియో సాక్ష్యాల‌ను కూడా సేక‌రించింది టీ స‌ర్కార్‌. దీంతో.. ఏపీ ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అక్ర‌మ ప్రాజెక్టులు క‌డుతోంద‌నే వాద‌న‌కు బ‌లం చేకూరిన‌ట్టు అయ్యింది.

అయితే.. దీనికి ఏపీ చెబుతున్న స‌మాధానం ఏమంటే.. తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి 29 టీఎంసీలు వాడుకోవ‌డానికి ఉంది. ఎస్ఆర్బీసీ 19 టీఎంసీలు, గాలేరు న‌గ‌రి నుంచి 38 టీఎంసీల చొప్పున తీసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. ఈ నీటిని త‌ర‌లించ‌డానికే తాము రాయ‌ల‌సీమ లిఫ్ట్ నిర్మిస్తున్న‌ట్టు చెబుతోంది. ఈ విధంగా.. రెండు రాష్ట్రాలు భిన్న వాద‌న‌లు వినిపిస్తుండ‌డంతో స‌మ‌స్య జ‌ఠిల‌మైంది.

అంతేకాదు.. ఏపీ స‌ర్కారు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్రాజెక్టులు క‌డుతోంది కాబ‌ట్టి.. తాము కూడా నిర్మిస్తామ‌న్న‌ట్టుగా.. గ‌ద్వాల‌, వ‌న‌ప‌ర్తి జిల్లాల మ‌ధ్య కృష్ణా న‌దిపై అలంపూర్ వ‌ద్ద ఓ బ్యారేజీ నిర్మించాల‌ని నిర్ణ‌యించుకుంది. దీన్నుంచి 70 టీఎంసీల నీటిని ఏదుల రిజ‌ర్వాయ‌ర్ కు ఎత్తిపోయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్త‌యితే.. దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీకి నీటి విష‌యంలో ఇబ్బందులు వ‌స్తాయ‌నే అభిప్రాయం కూడా ఉంది.

ఈ విధంగా.. ఒక‌రి లోపాల‌ను మ‌రొక‌రు చూపిస్తూ.. ఒక‌రు అక్ర‌మ ప్రాజెక్టులు నిర్మిస్తున్నార‌ని మ‌రొక‌రు అదే ప‌ద్ధ‌తిని అనుసరిస్తున్నార‌ని అంటున్నారు నిపుణులు. మ‌రి, ఇందులో అస‌లు త‌ప్పు ఎవ‌రిది? కృష్ణా యాజమాన్య బోర్డు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుంది అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి కాబోలు.