Waqf : తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) రెండు రాజకీయ పార్టీలు సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయి. కేంద్రం ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తేనుంది. దీంతో ఓటింగ్ తప్పనిసరిగా మారనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎలా ముందుకు వెళ్తాయి అన్నది ఇప్పుడు ప్రశ్న. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా టిడిపి తో పాటు జనసేన ఉంది. ఆ రెండు పార్టీలు తప్పకుండా మద్దతు తెలుపుతాయి. కాంగ్రెస్ ఎలాగూ వ్యతిరేకిస్తోంది. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ వైఖరి ఏంటన్నది తెలియాల్సి ఉంది.
Also Read : ఏమిటీ వక్ఫ్.. దేశవ్యాప్తంగా ఎందుకింత చర్చ?
* ముస్లింల మద్దతు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ముస్లింలు నిలుస్తూ వచ్చారు. గత ఐదేళ్ల పాటు బిజెపితో స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ముస్లింలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలు ఆ పార్టీకి బలం. ఈ తరుణంలో బిజెపి పొత్తు ప్రతిపాదన తెచ్చిన జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గడానికి ఇదే ప్రధాన కారణం. అందుకే ఇప్పుడు ఈ బిల్లు సవరణ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బిజెపి అడగకుండానే జాతీయస్థాయిలో చాలా అంశాలకు మద్దతు తెలిపారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు బాహటంగా ఓటింగ్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఏంటన్నది బయట పెట్టడం లేదు.
* కెసిఆర్ ది భిన్న వైఖరి
కెసిఆర్ ( KCR) నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ సైతం ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఓటమి తప్పలేదు. సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. దీంతో ఆ పార్టీ ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. మరోవైపు అవినీతి కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికీ కెసిఆర్ కుమార్తె కవిత జైలుకు వెళ్లి వచ్చారు. బిజెపి వ్యతిరేక వైఖరి అనుసరిస్తే తప్పకుండా కేసులు చుట్టుముడతాయి. అందుకే ఈ బిల్లు విషయంలో కెసిఆర్ సైతం పునరాలోచనలో పడినట్లు సమాచారం.
* రెండు పార్టీల్లో స్పష్టమైన మార్పు..
అయితే ఇటీవల ఈ రెండు పార్టీల వైఖరి మారింది. బిజెపి( Bhartiya Janata Party) విషయంలో కాస్తా మార్పు కనిపిస్తోంది. అయితే రెండు పార్టీలకు కేసుల బెడద మాత్రం ఉంది. మొన్నటికి మొన్న స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలంగాణ నుంచి కేటీఆర్ హాజరయ్యారు. ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఉంది కానీ.. ఆయన హాజరు కాలేదు. కానీ కేంద్రానికి లేఖ రాశారు. అయితే తాజాగా పార్లమెంటు ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు వస్తుండడంతో ఇప్పుడు ఆ రెండు పార్టీలు అనుసరించే వైఖరి ఎలా ఉండబోతుంది అన్నది హాట్ టాపిక్ అవుతోంది.
Also Read : వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో వడివడిగా మారుతున్న కేరళ రాజకీయాలు