Karnataka Election Results : రాహుల్ గాంధీ ఓ మెట్టేక్కేశాడు.. ఉండవల్లి షాకింగ్ కామెంట్స్

రాహుల్ గాంధీ దేశానికి భావి నాయకుడని ఉండవల్లి తేల్చేశారు. పాదయాత్రతో ఆయనలో సమూల మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ లక్షణాలు పుణికిపుచ్చుకున్నట్టు కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.

Written By: Dharma, Updated On : May 20, 2023 12:52 pm
Follow us on

Karnataka Election Results : కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఎంతో మంది ముఖాల్లో చిరునవ్వు వెల్లివిరిసింది. అందులో కాంగ్రెస్ మాజీలు సైతం ఉన్నారు. దశాబ్దాలుగా ఆ పార్టీతో పోరాడిన వారూ ఉన్నారు. కాషాయదళం ఎత్తులకు, చిత్తులకు బలైన బాధితులంతా ఇప్పుడు సంతోషిస్తున్నవారే. అంతెందుకు బీజేపీతో కలిసి నడవాలనుకుంటున్నవారు సైతం లోలోపల కర్నాటక అపజయాన్ని స్వాగతిస్తున్నారు. తెలంగాణలో కూడా ఇదే ఫలితం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. వివిధ కారణాలతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన వారు పునరాగమనానికి సంకేతాలు పంపుతున్నారు.

కాంగ్రెస్ లో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం న్యూట్రల్ గా ఉన్నారు. విశ్లేషకుడిగా కొనసాగుతున్నారు. అన్నింటికీ మించి మార్గదర్శిపై న్యాయపోరాటం చేస్తున్నారు. అడపాదడపా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే తాజాగా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. కర్నాటక ఫలితం చూసి చాలా ఆనందం వేస్తోందని చెప్పుకొచ్చారు. 1993లో కర్నాటకలో గెలుపుతోనే పతనమైపోయిందనుకున్న కాంగ్రెస్ పైకిలేచిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఆ సెంటిమెంట్ రీపిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీని ఎదురుగా నిలబడే శక్తి కాంగ్రెస్ కే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఎక్కడైనా పోలైన ఓట్లలలో ఎక్కువ ఎవరికి వస్తే వారే గెలుస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ఓట్లు చీల్చే విధంగా రాజకీయం చేస్తుందన్నారు.మోదీ నోట్లు రద్దు చేసినప్పుడు డిజిటల్ మనీ వస్తుందనుకున్నామని తెలిపారు. అప్పుడు కరెన్సీ రూ.16 లక్షల కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ.19 లక్షల కోట్లు చలామనీలో ఉన్నాయని తెలిపారు. పార్టీలను భయపెట్టడం కోసం తప్ప.. జీఎస్టీ ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ దేశానికి భావి నాయకుడని ఉండవల్లి తేల్చేశారు. పాదయాత్రతో ఆయనలో సమూల మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ లక్షణాలు పుణికిపుచ్చుకున్నట్టు కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. రాహుల్ తో తనకు ఎదురైన పరిణామాలను గుర్తుకు తెచ్చుకున్నారు. విమానంలో కలిసిన రాహుల్ ను పలుకరించి తానెవరో చెప్పాలని అడిగితే.. తిరిగి నా కుమార్తెతో వీడియోకాల్ మాట్లాడించిన గొప్ప నేర్పరి రాహుల్ గాంధీ అని ఉండవల్లి కితాబిచ్చారు. మొత్తానికైతే కర్నాటకంతో దేశ రాజకీయాలో కొత్త నాటకం మొదలవుతుందని అరుణ్ కుమార్ తేల్చేశారు.