Chhattisgarh : ఇండియా ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ పాలకులను ప్రజలు ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. దేశం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా మూరుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఓటు వేయని ప్రజలు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. అలాంటి ఓ గ్రామం ఛత్తీస్ గఢ్ లో ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత గ్రామంలో ప్రజలు 75ఏళ్లుగా ఏ విధమైన ఎన్నికల్లోనూ ఓటు వేయలేదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇలాంటి గ్రామం ఒకటి ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇన్నేళ్ల తర్వాత కానీ ఛత్తీస్‌గఢ్‌లోని ఒక గ్రామంలో నివసించే ప్రజలు స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి ఓటు వేయగలిగారు.
ఈ ఊరి పేరు కేరళపెండ. ఈ గ్రామ ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయడం భారత ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద సంఘటనగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గ్రామ ప్రజలు మొదటిసారి ఓటు వేశారు. ఈ గ్రామం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఉంది. ఇక్కడ మూడవ దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా భద్రతా దళాల గట్టి భద్రత మధ్య గ్రామస్తులు ఓటు వేసేందుకు వరుసలో నిలబడ్డారు.
గ్రామం నుండి బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్లకు ఇన్నాళ్లకు స్వాతంత్ర్యం వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో గట్టి భద్రత మధ్య, పురుషులు, మహిళలు తమ ఓటు వేయడానికి వరుసలో నిలబడి వేచి ఉండటం కనిపించింది. నక్సలైట్ సంఘటనల బారిన పడిన ఈ గ్రామ ప్రజలు దీనికి ముందు ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయలేదు. ఓ గ్రామస్తుడు మాట్లాడుతూ..‘‘ కేరళపెండ గ్రామ ప్రజలు మొదటిసారిగా నాయకుల ముందు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. దీంతో ఓటేసే అవకాశం వచ్చింది. సమీప గ్రామాల ప్రజలు కూడా బాధ్యతాయుతమైన పౌరులుగా ఓటు వేయడానికి రావాలని చర్చించినట్లు తెలిపాడు.
గ్రామానికి చెందిన మరో ఓటరు మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు దేశ ప్రజాస్వామ్య నిర్ణయంలో మనం మన పాత్రను పోషిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. మన గ్రామం కూడా అభివృద్ధి వైపు ముందుకు సాగుతుంది. మా నాయకులతో మాట్లాడి మా డిమాండ్లను ముందుకు తెచ్చే అవకాశం లభించడం ఇదే మొదటిసారి.’’ అని అన్నాడు.
ఫిబ్రవరి 20న జరిగిన రెండవ దశ ఎన్నికల సమయంలో తిరుగుబాటు సంఘటనలకు సుదీర్ఘ చరిత్ర ఉన్న బీజాపూర్ జిల్లా ప్రజలు కూడా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భూపాల పట్నం గ్రామంలోని ఓటింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి దట్టమైన అడవులు, నదులు సహా అనేక క్లిష్టమైన మార్గాల గుండా 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. దాదాపు ఐదు గ్రామాల ప్రజలు తమ తమ ప్రాంతాలలో నక్సలైట్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నారు. ఈ గ్రామాలు నక్సలైట్లు ఆశ్రయం పొందడానికి సురక్షిత ప్రదేశాలుగా భావిస్తారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఓటు వేయడానికి గ్రామస్తులంతా కలిసి వచ్చారు.
