TDP Janasena Alliance: ఎన్నికల్లో పరస్పరం పొత్తు పెట్టుకుంటే ఓట్ల బదిలీ జరగాలి. అప్పుడే ప్రత్యర్థి పార్టీ నుంచి అధికారం లభిస్తుంది. లేనిపక్షంలో ఆ పొత్తు అనేది ఒక విఫల ప్రయత్నం లాగా మిగిలిపోతుంది. ఎన్నికలన్నాక పొత్తులు అనేవి సహజం. రాజకీయపరంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ అధికారమనేది అన్నింటిని మరుగున పడేస్తుంది. ఫర్ సపోజ్ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ కు, కమ్యూనిస్టులకు బద్ధమైన వైరం ఉంటుంది. అయినప్పటికీ వారు ఇండియా కూటమిలో చేతులు కలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి, ఆప్ నేతలకు మధ్య వైరుధ్యం ఉంటుంది. ఆయినప్పటికీ ఇండియా కూటమిలో ఆ రెండు పార్టీలు చేరాయి. సో ఇక్కడ సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యం కాబట్టి రాజకీయ పార్టీలు దానికోసమే ఆలోచిస్తూ ఉంటాయి. తమకు అధికారం దక్కేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలో అలాంటి వాటిని అమలులో పెడతాయి. అయితే ఓట్ల బదిలీ జరిగినప్పుడే ఆ పొత్తుకు ఒక సార్ధకత ఉంటుంది. ఈ సువిశాల భారత దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుని అధికారాన్ని దక్కించుకున్నాయి. అదే పొత్తు వల్ల అధికారాన్ని కోల్పోయాయి. సో ఏ పొత్తు ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుందో.. ఎలాంటి గుణపాఠాలు మిగుల్చుతుందో ఎవరూ చెప్పలేరు.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని టిడిపి తలపోస్తోంది. అధికారంలో ఉన్న వైసిపి తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. సహజంగానే అధికారంలో ఉంది కాబట్టి వైసిపి కొంత బలంగా కనిపిస్తోంది. ఎన్నికల పోటీల్లో బలమైన అభ్యర్థులను జగన్ రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు చెందిన అసెంబ్లీ ఇన్చార్జిలను నియమించారు కూడా. అధికారికంగా ప్రకటన ఇవ్వడమే మిగిలింది. బలమైన వైసీపీని దెబ్బ కొట్టాలంటే టిడిపికి ప్రస్తుతం ఉన్న బలం సరిపోదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకోదగిన స్థాయిలో నిరసన తెలుపలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు అప్పుడే పరిస్థితి ఒకసారి గా మారిపోయింది. ఆయన చంద్రబాబు నాయుడు కు మద్దతు ఇస్తున్నామని ప్రకటించడంతో ఒకసారిగా టిడిపి జనసేన మళ్లీ కలిసిపోయిన సంకేతాలు ఇచ్చారు. అయితే పైకి చూస్తే ఇది బాగున్నట్టే అనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం గతం తాలూకు చేదు జ్ఞాపకాలు జనసేన నాయకులను ఇబ్బంది పెడుతున్నాయి. వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసి అధికారాన్ని దక్కించుకుంటారని జనసేన నాయకులు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని భావించారు. కానీ వారి ఆశలు అడియాసలు చేస్తూ ఆయన టిడిపికి మద్దతు పలికారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవుతారని లోకేష్ స్పష్టంగా చెప్పారు. ఫలితంగా జనసేన భవిష్యత్తు ఏమిటి అనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
ఇక ఇదే పొత్తుకు సంబంధించి రాజకీయంగా విశ్లేషణలు జరిగినప్పుడు పలు రకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టిడిపి జనసేన ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. జనసేన కార్యకర్తల ఓటు బ్యాంకు టిడిపికి బదిలీ కాదని.. గత ఎన్నికల్లో పెట్టుకున్న పొత్తు వల్ల.. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల జనసేన ఇబ్బంది పడిందని.. టిడిపి నాయకులు దూషణలకు పాల్పడటంతో ఇబ్బంది పడాల్సి వచ్చిందని.. ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకుంటున్నారని.. ఒకవేళ అధికారంలోకి వస్తే తర్వాత జరిగేది కూడా అదే అని.. రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. పైగా జనసేన కార్యకర్తలను జండా మోసే కూలీలుగా వైసీపీ నాయకులు అభి వర్ణిస్తుండడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఒకింత చర్చనీయాశంగా మారింది. అయితే దీనిని ఏ విధంగా సరి దిద్దుతారు, క్షేత్ర స్థాయిలో పార్టీకి ఏ విధమైన జీవసత్వాలు కల్పిస్తారు ప్రశ్నలకు అటు టిడిపి నాయకులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జనసేన నాయకులు కార్యకర్తలు ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది.
ఒకరి ఓట్లు మరొకరికి వేయరు కనుక పొత్తు బొక్కే అంటున్న విశ్లేషకులు pic.twitter.com/mwXslroWSp
— Inturi Ravi Kiran (@InturiKiran7) December 27, 2023