https://oktelugu.com/

CM Jagan: జగన్ పై సమ్మెల అస్త్రం పనిచేస్తుందా?

తాను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా జీతం పెంచుతానని జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1000 చొప్పున జీతం పెంచారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 27, 2023 / 02:30 PM IST

    CM Jagan

    Follow us on

    CM Jagan: ఏపీ సీఎం జగన్ పై ఒక్కసారిగా ఉద్యోగ, కార్మిక వర్గాలు తిరుగుబాటు చేస్తున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట సమ్మె అస్త్రాన్ని సంధించాయి. అంగన్వాడీ కార్మికులు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, వలంటీర్లు.. ఇలా అందరూ రోడ్లపైకి వచ్చి ముప్పేట దాడి చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. హక్కుల కోసం గొంతు ఎత్తుతున్నారు. అయితే వీరిని సంఘటిత పరిచి జగన్ పై వామపక్షాలు ఉసిగొల్పుతున్నాయి. సహజంగానే వీరికి విపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. అయితే ఈ క్రమంలో పాము వస్తే ఏం చేస్తామన్న విషయం విపక్షాలు చెప్పడం లేదు.కనీసం హామీ కూడా ఇవ్వడం లేదు. అటు పోరాటం చేస్తున్న వర్గాలు సైతం అడగడం లేదు.

    తాను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా జీతం పెంచుతానని జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1000 చొప్పున జీతం పెంచారు. కానీ అంగన్వాడీ కార్మికులు మాత్రం తమకు కనీస వేతనంగా.. రూ.26 ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కానీ అందుకు వైసిపి సర్కార్ సుముఖంగా లేదు. ఇప్పుడు ఇస్తున్న వేతనంలో కేవలం రూ.4 వేలు మాత్రమే కేంద్రం అందిస్తోంది. మిగతా వాటాగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు కానీ ఆ స్థాయిలో పెంచితే రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడడం ఖాయం. అందుకే ఒక్క జీతాల పెంపు తప్పించి.. మిగతా డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది.

    ఆశా కార్యకర్తలు సైతం సమ్మె బాట పట్టడం విశేషం. వారు సైతం తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతున్నారు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సైతం అదే డిమాండ్లతో ముందుకు సాగుతున్నారు. గతంలో దశలవారీగా ఉద్యమించి వేతనాల పెంపు విషయంలో కొంత ఉపశమనం పొందారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో అత్యవసర సేవగా పరిగణించి తమ జీతాలు పెంచుతారని సమ్మె అస్త్రం సంధించారు. చివరకు జగన్ మానస పుత్రికలు అయిన వాలంటీర్లు సైతం ఆందోళన బాటకు దిగారు. తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి ఆందోళన కార్యక్రమాలకు ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. కానీ తాము అధికారంలోకి వస్తే పెంచుతామని మాత్రం చెప్పడం లేదు. వారు కూడా అడగడం లేదు. దీంతో రాజకీయ అంశంగా మారిపోతుంది.

    గత ఎన్నికల ముందు జగన్ అవలంబించిన తీరును ఇప్పుడు విపక్షాలు అస్త్రంగా మలుచుకున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు కమ్యూనిస్టులను దువ్వారు. వారు తమ చేతుల్లో ఉన్న ఉద్యోగ, కార్మిక సంఘాలతో ఉద్యమాలను ప్రారంభించారు. జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత రావాలన్నది వారి లక్ష్యం. అది అంతిమంగా ప్రధాన విపక్షాలకు టర్న్ అవ్వాలన్నది అభిమతం. దీనికి రాజకీయ లక్ష్యం ఉండడంతో ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంటుంది. అందుకు అవసరమైన వ్యూహాలు రాజకీయ పార్టీల నుంచి అందుతున్నాయి. దీంతో పరిస్థితి మరింత జఠిలంగా మారుతుంది. మొత్తానికైతే ఎన్నికల ముంగిట జగన్ సమ్మె అస్త్రాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుండడం మాత్రం ఖాయం.