Chandrababu: అటు కాంగ్రెస్.. ఇటు బిజెపి.. బాబు రెండు పడవల ప్రయాణం

ఏపీలో తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి 2014లో పోటీ చేసి విజయం సాధించాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తనకు అలవాటైన అవసరార్థ రాజకీయాలకు తెర లేపారు.

Written By: Anabothula Bhaskar, Updated On : December 27, 2023 2:42 pm

Chandrababu

Follow us on

Chandrababu: రాజకీయమంటే ఇలానే ఉండాలని కాదు. అలా ఉంటేనే రాజకీయమని కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేయడమే.. ఏ నావ బాగుంటే అందులో కలిసి ప్రయాణం చేయడమే.. అంతిమంగా అధికారం దక్కిందా? లేదా? అనేదే ముఖ్యం.. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి.. రాజకీయ సమీకరణాలు క్రమక్రమంగా మారిపోతున్నాయి. కొత్త కొత్త పొత్తులకు బీజాలు పడుతున్నాయి. సరే తర్వాత ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే చర్చనీయాశంగా మారుతున్నాయి.

ఏపీలో తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి 2014లో పోటీ చేసి విజయం సాధించాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తనకు అలవాటైన అవసరార్థ రాజకీయాలకు తెర లేపారు. ఫలితంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు. ఆ తర్వాత బిజెపి నాయకులు కూడా తెగదెంపులు చేసుకున్నారు. ప్రత్యేక హోదా పేరుతో చంద్రబాబు నాయుడు సరికొత్త రాజకీయాలకు తెరలేపారు.. అయితే అప్పటికే జగన్ మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడంతో టీడీపీకి ఓటమి అనివార్యమైంది. ఏకంగా 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు కి తత్వం బోధపడింది. ఈ లోగానే స్కిల్ డెవలప్మెంట్ కేసు రూపంలో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత అనేక న్యాయ సంప్రదింపుల అనంతరం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వబోనని ముఖం మీదే చెబుతున్నారు.. దీంతో కొంతమంది టిడిపిలోకి వెళ్తుంటే.. మరి కొంతమంది వైసీపీలోనే ఉంటామని చెబుతున్నారు. అయితే ఇలా అభ్యర్థులను మార్చితే కచ్చితంగా గెలుపొందే అవకాశం ఉంటుందని ఏపీలో రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే జరిగితే టిడిపికి కష్టం కాబట్టి.. తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలంటే కచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలవాలి కాబట్టి.. సరికొత్త రాజకీయ చతురతకు చంద్రబాబునాయుడు పదును పెడుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో ఆ ప్రభావం ఏపీ పై కూడా ఉంటుందని భావించి.. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రయాణం చేసేందుకు చంద్రబాబు నాయుడు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో 2014 ఎన్నికల్లో సహకరించిన జనసేన, బిజెపితోనూ సయోధ్య కొనసాగిస్తున్నారు. అంటే ఏకకాలంలో రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నారు. అంతిమంగా ఇది ఏ గమ్యానికి చేర్చుతుందో తెలియదు గానీ.. మస్తానికైతే చంద్రబాబు నాయుడు ఉభయకుశలోపరి అనే పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ.. కొంతమంది రాజకీయ విశ్లేషకుల ద్వారా తెరపైకి వచ్చింది. దీంతో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. తన రాజకీయ అవసరాల కోసం ఎవరితోనైనా ప్రయాణం చేసేందుకు చంద్రబాబు నాయుడు ముందుంటారని.. పార్టీకి సంబంధించిన విధివిధానాలను తాకట్టు పెట్టడంలో ఆయన సిద్ధహస్తుడని వైసిపి నాయకులు విమర్శిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను గంగలో కలిపి అధికారాన్ని అనుభవించడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.. మరి దీనిని టిడిపి నాయకులు ఏ విధంగా సమర్థించుకుంటారో వేచి చూడాల్సి ఉంది. టీడీపీకి డప్పు కొట్టే మీడియా మాత్రం చంద్రబాబు నాయుడు రెండు పడవల ప్రయాణాన్ని చారిత్రాత్మక అవసరం గా పేర్కొనడం విశేషం.