Vivek: ఇప్పటికీ 6 సార్లు పార్టీ మార్పు.. వీ6 వివేక్‌ను గిన్నిస్‌ బుక్‌లో ఎక్కించాల్సిందే!

2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో వివేక్‌ టీఆర్‌ఎస్‌లో ఉండి, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తన అన్న వినోద్‌కు మద్దతు ప్రకటించారు. ఈవిషయం తెలియడంతో సీఎం కేసీఆర్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో వివేక్‌కు టికెట్‌ ఇవ్వలేదు.

Written By: Raj Shekar, Updated On : November 1, 2023 3:41 pm

Vivek

Follow us on

Vivek: తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, గడ్డం వెంకటస్వామి(కాకా) తనయులు వినోద్, వివేక్‌ రాజకీయాల్లోకి వచ్చారు. వినోద్‌ గతంలో చెన్నూర్‌ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. వ్యాపార వేత్త అయిన వివేక్‌ పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న తండ్రిలా వివేక్‌ ఏనాడూ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయడం లేదు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. అధికారంలో ఎవరు ఉంటూ ఆ పార్టీలో చేరుతూ తండ్రి పేరుకు కూడా మచ్చ తెచ్చారు. కాంగ్రెస్‌ సిద్ధాంతానికి వెంకటస్వామి రాజకీయాలు చేశారు. కాష్టాల్లో, నష్టాల్లో ఎన్నడూ పార్టీ మారాలని చూడలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌(ప్రస్తుత బీఆర్‌ఎస్‌) పార్టీలో చేరాలని ఎంత ఒత్తిడి చేసినా ఆయన కాంగ్రెస్ లో ఉండే తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటూ రాజకీయం చేశారు వెంకటస్వామి.

వివేక్‌ తీరే వేరు..
డబ్బులు ఉంటే రాజకీయం చేయొచ్చన్న ఆలోచనతో రాజకీయాల్లో వచ్చిన వివేక్‌ తీరే వేరు. రాజకీయ పార్టీలు కూడా ఆయనను మంచి ఆర్థిక వనరుగానే చూస్తున్నాయి. ఎందుకంటే మంచి లీడర్‌గా చూడడానికి వివేక్‌ రాజకీయంగా ఇంకా పరిణతి చెందలేదు. పదవి కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం డబ్బులు పంచడం మాత్రం నేర్చుకున్నారు. దీంతో తన రాజకీయ భవిష్యత్, తన వ్యాపారం దెబ్బతినకుండా ఉండేందుకు తరచూ పార్టీలు మారుతున్నారు.

పదేళ్లలో ఆరుసార్లు పార్టీ మార్పు..
ఇక వివేక్‌ గడిచిన పదేళ్లలో ఆరుసార్లు పార్టీలు మారారు. 2009లో తొలిసారి కాంగ్రెస్‌ తరఫున పెద్దపల్లి లోక్‌సభ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. దీంతో కాంగ్రెస్‌లో ఉండి ఆయన తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపారు. 2014లో లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన వారిలో వివేక్‌ కూడా ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు పార్లమెంట్‌ బొగ్గు,ఉక్కు కమిటీల సభ్యుడిగా కూడా ఉన్నాడు.

2013లో తొలిసారి పార్టీ మార్పు..
తన తండ్రి కాంగ్రెస్‌ వాది కావడంతో వివేక్‌ కూడా కాంగ్రెస్‌ నుంచే రాజకీయ ప్రవేశం చేశారు. కానీ 2013లో తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడం, తెలంగాణ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌ తన ప్రకటనను ఉపసంహరించుకోవడం, తర్వాత కాంగ్రెస్‌ ఎంపీలపై ఒత్తిడి పెరగడంతో విధిలేని పరిస్థితిలో వివేక్‌ 2013 జూన్‌ 2, తొలిసారి పార్టీ మారారు. కాంగ్రెస్‌ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత..
ఇక తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడం, తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్‌ ప్రకటించడంతో సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడానికి అంగీకరించారు. ఈమేరకు 2013 డిసెంబర్‌ 9న ప్రకటన చేశారు. 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో వివేక్‌ మరోసారి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. 2014, మార్చి 31న తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కానీ టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తాన్న కేసీఆర్‌ మాత్రం మాట నిలబెట్టుకోలేదు. ఒంటరిగా సార్వత్రిక ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన వివేక్, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ చేతిలో ఓడిపోయారు.

2016లో మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి..
తెలంగాణలో 2014లో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత మిగతా పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను గులాబీ గూటిలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ క్రమంలో వివేక్‌ 2016లో మరోమారు పార్టీ మారారు. ఈసారి కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో సీఎం కేసీఆర్‌ ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు.

లోక్‌సభ టికెట్‌ ఇవ్వకపోవడంతో..
ఇక 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో వివేక్‌ టీఆర్‌ఎస్‌లో ఉండి, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తన అన్న వినోద్‌కు మద్దతు ప్రకటించారు. ఈవిషయం తెలియడంతో సీఎం కేసీఆర్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో వివేక్‌కు టికెట్‌ ఇవ్వలేదు. కాంగ్రెస్‌ తరఫున చెన్నూర్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన వెంకటేశ్‌నేతను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ఎంపీ టికెట్‌ ఇచ్చారు. దీంతో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వివేక్‌ 2019, మార్చి 25న టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ క్రమంలో ముఖం బాగా లేదని అద్దం పగలగొట్టినట్లు.. రాజకీయాలు తనకు అచ్చి రావడం లేదని పేరులో మార్పులు చేసుకున్నారు. తన తండ్రి పేరును తన పేరు వెనక యాడ్‌ చేసుకున్నారు. దీంతో వివేక్‌ కాస్త వివేక్‌ వెంకటస్వామిగా మారారు.

5 నెలల తర్వాత బీజేపీ గూటికి..
టీఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత బీజేపీలో చేరతారని అంతా భావించారు. బీజేపీ పెద్దలు కూడా వివేక్‌తో మంతనాలు జరిపారు. లోక్‌సభ టికెట్‌ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ, వివేక్‌ ఏ పార్టీలోనూ చేరలేదు. ఐదు నెలలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ, 2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రావడంతో 2019 ఆగస్టు 9న వివేక్‌ భారతీయ జనతాపార్టీలో చేరారు. సీనియర్‌ నాయకుడిగా బీజేపీ వివేక్‌కు గుర్తింపు ఇచ్చింది. 2021, అక్టోబర్‌ 7న ఆయనను కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా నియమించింది.

మళ్లీ ఆరోసారి పార్టీ మారి..
తాజాగా మళ్లీ వివేక్‌ పార్టీ మారారు. ఈసారి తన భవిష్యత్‌తోపాటు తన కొడుకు భవిష్యత్‌ చూసుకుని బీజేపీని వీడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్‌ టికెట్‌ను వివేక్‌ తనయుడు వంశీకి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ టికెట్‌ కూడా వివేక్‌కు ఇవ్వడానికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో నెల రోజుల తర్జనభర్జన తర్వాత వివేక్‌ బీజేపీని వీడారు.

సోషల్‌ మీడియాలో ట్రోల్‌..
స్ట్రాంగ్‌ సోషల్‌ మీడియా వింగ్‌ ఉన్న బీజేపీ వివేక్‌ పార్టీని వీడిన వెంటనే ఆయనను ట్రోల్‌ చేయడం మొదలు పెట్టింది. తెలంగాణలో ఆరుసార్లు పార్టీ మారిన నేతగా వివేక్‌ను గిన్నిస్‌ రికార్డులో నమోదు చేయాలని క్యాప్షన్‌తో ఓ వీడియోను నెట్టింట్లో వైరల్‌ చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. నిలకడలేని వివేక్, నిలకడలేని వీ6 రెండింటినీ గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కించాలి.. రాజకీయం తెలియని లీడర్‌ వివేక్‌.. ఏ ఎండకు ఆ గొడుగు.. పైసలు ఉన్నోళ్లు ఎన్నిసార్లు అయినా పార్టీ మారొచ్చు.. అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.