\
విశాఖ దుర్ఘటన చోటు చేసుకున్న అనంతరం తెల్లవారుజామున 3.30 గంటల డయల్ 100 ద్వారా పోలీసులకు మొదట సమాచారం అందింది. అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ సిబ్బంది ఈ విషయాన్ని ఆ ప్రాంత పోలీసు స్టేషన్ కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకోక ముందు పోలీసులు ఇది అంత పెద్ద సమస్యగా భావించలేదు. అక్కడకు చేరుకున్న ఎస్.హెచ్.ఓ, ఇతర సిబ్బంది సహాయక చర్యలు చేపడుతూనే సంఘటనా తీవ్రత గుర్తించి విషయాన్ని సిపి రాజీవ్ కుమార్ మీనాకు తెలియజేశారు. దీంతో సిపి, ఆ ప్రాంత డిసిపి అక్కడకు చేరుకున్నారు.
విశాఖ గ్యాస్ లీక్ పై జగన్ కు ప్రధాని ఫోన్
పోలీసులు వారి వద్దనున్న మైక్ తో ఆర్.ఆర్.వి పురం ప్రాంతంలోని ప్రజలను నిద్రలేపేందుకు ప్రకటన చేశారు. అప్పటికే ఫ్యాక్టరీ సమీప ప్రాంతంలోని కొందరు ఊపిరాడక నిద్ర లేచి పరుగులు పెడుతున్నారు. అంబులెన్స్, పోలీసు వాహనాలు, ఆటోలు, యువకుల బైక్ లు అవకాశం ఉన్న అన్ని మార్గాలలో ఆ ప్రాంతంలోని ప్రజలను బయటకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. స్థానిక యువత సహకారాన్ని పోలీసులు తీసుకుని వృద్ధులు, పిల్లలు, మహిళలను అక్కడి నుంచి తరలించే చర్యలు తీసుకున్నారు. మరోవైపు దుర్ఘటన సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించి, పరిసర ప్రాంతాల ఏ.పి.ఎస్.పి, ఎన్.డి.ఆర్.ఎఫ్ నగరపాలక సంస్థ సిబ్బందిని రంగంలోకి దించసారు. వీరు 5.30 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలలో పాలుపంచుకున్నారు. దాదాపు 8 గంటల సమయానికి ఆపరేషన్ పూర్తి చేసినట్లు సిపి రాజీవ్ కుమార్ మీనా తెలిపారు.
పోలీసులు, ఇతర శాఖల అధికారులు తక్షణ సహాయక చర్యలు తీసుకోకుంటే ఈ సంఘటనలో ప్రాణనష్టం మరింతగా పెరిగెదని స్పష్టం అవుతోంది.