
కరోనా మహమ్మారిపై సుమారు రెండు నెలలుగా పోరాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల దేశ ప్రజలలో విశ్వాసం పెరుగుతూ ఉన్నప్పటికీ బిజెపి ముఖ్యమంత్రుల పనితీరు మాత్రం ప్రజలకు అసంతృప్తి కలిగిస్తుండడం ఆయనకు ఆందోళన కలిగిస్తున్నది.
ముఖ్యంగా ఈ పోరాటం క్షేత్రస్థాయిలో చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వాలు కావడంతో, బీజేపీ సీఎంల పనితీరు కన్నా, ఇతర పార్టీల సీఎంల పనితీరు ప్రశంసాపూర్వకంగా ఉండడం కలవరం కలిగిస్తున్నది.
విశాఖ గ్యాస్ లీక్ పై జగన్ కు ప్రధాని ఫోన్
ఒకప్పుడు కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో మంచి నాయకత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకులు లేక ఆ పార్టీ ఇబ్బంది పడుతూ ఉండెడిది. అదే సమయంలో జాతీయ స్థాయిలో నాయకులు బలహీనులైనా రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకులు బిజెపికి ఉంటూ ఉండేవారు.
కానీ ఇప్పుడు ఆ పరిష్టితి తిరగబడింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం దాదాపు పడకవేసిన్నట్లు అయింది. కానీ పలు రాష్ట్రాలలో బలమైన నాయకులు బిజెపిని నిద్రపోనీయడం లేదు. పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ వంటి రాష్ట్రాలలో ఆ పార్టీ సీఎంల పనితీరు ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రశంసలు పొందుతున్నది.
ఇతర పార్టీలు అధికారంలో ఉన్న ఢిల్లీ, కేరళ, తెలంగాణ, తమిళ్ నాడు, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో సహితం ముఖ్యమంత్రులు కరోనా ఆకట్టడిలో తమదైన ముద్ర వేస్తున్నారు. కానీ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లో దేశంలోనే అత్యధికంగా కరోనా మరణాలు ఉండడం, అహ్మదాబాద్ నగరంలో ఈ వైరస్ ప్రమాదస్థాయికి చేరుకోవడం బిజెపి నాయకత్వాన్ని కలవరానికి గురిచేస్తున్నది.
ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యం డెలివరీ!
ప్రపంచం అంతా కరోనా ప్రమాదం పట్ల అప్రమత్తం అవుతున్న సమయంలో ప్రధాని మోదీ, గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఘన స్వాగతం పలకడంలో నిమగ్నం కావడమే అందుకు కారణమా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
అస్సాంలో తప్ప బీజేపీ సీఎంల ఎవ్వరి పనితీరు ఈ సందర్భంగా సంతృప్తికరంగా లేదని చెబుతున్నారు. గుజరాత్ లో సీఎం విజయ్ రూపాని ఢిల్లీ నుండి నడిపించినట్లు నడిచే వారు కావడంతో సొంతంగా వ్యవహరింపలేక పోతున్నారు. ప్రధానికి నమ్మకస్తుడైన చీఫ్ ప్రిన్సిపాల్ కార్యదర్శి కైలాష్ నాథన్ ఇక్కడ పాలన అంతా నడిపిస్తున్నారు.
కర్ణాటకలో వైరస్ కట్టడికి సీఎం యడ్డ్యూరప్ప విశేషంగా కృషి చేస్తున్నా పార్టీలోని అంతర్గత కలహాలు ఆయనను నిద్రపోనీయడం లేదు. ప్రతిపక్షాల నుండి కన్నా సొంత పార్టీ నుండే ఆయనను అస్థిరత్వపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ట్రంప్ కు కరోనా భయం పట్టుకుందా!
ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ విశేషంగా కృషి చేస్తున్నా ఆయన ఒక మతం వారి పట్లనే కఠినంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చెలరేగడం, మరోవంక గత రెండు వారాలుగా కేసులు ఒకేసారి పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది.
మధ్య ప్రదేశ్ లో లాక్ డౌన్ ముందే సీఎం పదవి చేపట్టిన శివరాజ్ సింగ్ చౌహన్ కు విశేషమైన పాలననుభవం ఉన్నప్పటికీ బిజెపి కేంద్ర నాయకత్వమే ఆయనకు సమస్యగా మారింది. నెలరోజుల మేరకు కనీసం మంత్రివర్గం కూడా లేకుండా ఒంటరిగా గడపవలసి వచ్చింది. ఆ తరవాత కూడా ఐదుగురికి మించి చేర్చుకోలేక పొయారు. వారిలో అమిత్ షా కు సన్నిహితుడైన తన ప్రత్యర్థి నరోత్తం మిశ్రాకు హోమ్, ఆరోగ్య శాఖ ఇవ్వవలసి వచ్చింది.
ఇక బీజేపీ భాగస్వామిగా ఉన్న బీహార్ ప్రభుత్వం అయితే కుప్పకూలిన్నట్లు అయింది. మరో కొద్దీ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజావ్యతిరేకతను తెచ్చుకోవడం బిజెపికి ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఆయనను తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉండడంతో ఈ విషయంలో బిజెపి నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఈ సంవత్సరం బీహార్ లో, వచ్చే సంవత్సరం అస్సాం, పశ్సీమ బెంగాల్, కేరళ, తమిళ్ నాడు, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రాష్ట్రాలలో బిజెపికి బలమైన సీఎం అభ్యర్థులు లేరు. మోదీ మొఖం చూసి అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేయడం లేదని మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ లలో స్పష్టమైనది. అందుకనే రాష్ట్రాలలో బలహీన నాయకత్వం ఇప్పుడు బీజేపేని ఆందోళనకు గురిచేస్తున్నది.