Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తు ముమ్మరం చేయడంతో పాటు అరెస్ట్ లను కొనసాగిస్తోంది. తాజాగా అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు తెలంగాణకు చెందిన వినయ్ బాబులను అరెస్ట్ చేసింది. శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడికి స్వయాన సోదరుడు. లిక్కర్ స్కామ్ వెలుగుచూసిన నాటి నుంచి ఇద్దరిపై ఆరోపణలు వచ్చాయి. వీరిని సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది కూడా. వీరిద్దరూ పెద్ద ఎత్తున బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే క్రమంలో మద్యం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పక్కా సమాచారం సేకరించి వీరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అరబిందో ఫార్మా నుంచి సుమారు రూ.2 వేల కోట్లు ఢిల్లీ లిక్కర్ సిండికేట్ లోకి మళ్లించినట్టు దర్యాప్తులో తేలినట్టు సమాచారం.

లిక్కర్ స్కామ్ లో ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దల పేర్లు వినిపించాయి. కీలక నేతల కుటుంబసభ్యుల పాత్రపై ఆరోపణలు వచ్చాయి. అటు సీబీఐ కూడా చాలామందిని ప్రశ్నించింది. కానీ ఇప్పటివరకూ ముగ్గుర్ని అరెస్ట్ చేసింది. ప్రధానంగా తెలంగాణలోని అధికార పార్టీ పెద్దల బినామీలపై ఫోకస్ పెంచింది. బినామీలుగా భావిస్తున్న రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావులను సీబీఐ అధికారులు విచారించారు. ఇందులో రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారేందుకు ఒప్పకున్నట్టు ప్రచారం సాగుతోంది. అందుకే అభిషేక్ రావును అరెస్ట్ చేసి రామచంద్ర పిళ్లైను వదిలేశారన్న టాక్ నడుస్తోంది. ఆయన సీబీఐకి కీలక సమాచారం ఇచ్చినట్టు సమాచారం. తాజాగా పక్కా సమాచారాన్ని సేకరించే శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు లిక్కర్ వ్యాపారంలో అరితేరిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పాత్రపై కూడా సీబీఐ ఫోకస్ పెంచింది. ఇప్పటికే ఆయన్ను పలుమార్లు ప్రశ్నించారు.
అయితే తాజాగా శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేయడంతో అధికార వైసీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఈయన ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి సోదరుడు. అరబిందో ఫార్మాలో ఒన్ ఆఫ్ ది డైరెక్టర్, యాక్టివ్ రోల్ లో ఉన్నారు. అటు రేపో మాపో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అరెస్ట్ ను అడ్డుకునేందుకు విజయసాయిరెడ్డి ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసినట్టు కామెంట్స్ వినిపించాయి. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ప్రధాని విశాఖ పర్యటన ఏర్పాట్లలో ఉన్నారు.ప్రధాని విశాఖ చేరక ముందే రోహిత్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అటు అరబిందో ఫార్మాలో విజయసాయిరెడ్డి పాత్ర కూడా ఉంది. అయితే ఈ కేసు అల్లుళ్లతో ఆగుతుందో? లేదా తనవరకూ వస్తుందన్న బెంగా విజయసాయిరెడ్డిని వెంటాడుతోంది.

తాజా పరిణామాలతో వైసీపీలో కలవరం ప్రారంభమైంది. కీలక నేత విజయసాయిరెడ్డి బంధువులను సీబీఐ అరెస్ట్ చేయడం, ఎంపీ మాగుంట శ్రీనువాసులరెడ్డి కుమారుడ్ని ప్రశ్నించడంతో జగన్ సర్కారు డిఫెన్స్ లో పడింది. అయితే అల్లుడి అరెస్ట్ ను అడ్డుకోవడానికి విజయసాయిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. తెల్లారి లేచింది మొదలు ప్రధాని, హోంమంత్రులను పొగడ్తలతో ముంచెత్తడం, తనకు తెలిసిన వారి తరుపున లాబియింగ్ చేసినా అరెస్ట్ లను ఆపలేకపోయారు. ఒక వేళ కానీ పార్టీ ఎంపీలను సీబీఐ టచ్ చేస్తే తరుణోపాయం ఏంటన్న దానిపై జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కష్టం నుంచి గట్టెక్కించాలని ఆయన కేంద్ర పెద్దలను కోరే అవకాశమున్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపుతోంది. ప్రస్తుతానికైతే ఏపీ సర్కారుకు ముప్పు తెచ్చి పెట్టింది.