Vijayasai Reddy: విశాఖలో తనతో పాటు కుటుంబసభ్యులపై వచ్చిన భూ దందా ఆరోపణలపై మూడు రోజుల పాటు మల్లగుల్లాలు పడిన తరువాత విజయసాయిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. చంద్రబాబు సామాజికవర్గం, ఉత్తరాంధ్రపై కుట్ర, సొంత సొమ్ముతో మీడియా చానల్ పెడతానని ఏవేవో సంబంధం లేని కాకమ్మ కబుర్లుచెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పైగా బ్రాహ్మణి వ్యాపారం చేస్తే వాటికి బాలక్రిష్ణతో ఏం సంబంధమని పొంతన లేని సమాధానం చెప్పుకొచ్చారు. తన అల్లుడు, కూతురు వ్యాపారం చేసుకుంటే తప్పేంటన్న మీనింగులో మాట్లాడారు. అంతటితో ఆగకుండా రామోజీరావు చేతిలో మీడియా ఉందని రెచ్చిపోతున్నారని.. తాను సొంత డబ్బులతో చానల్ పెడతానని ప్రకటించారు. కానీ దీనికి రామోజీరావును సాకుగా చూపడమే నమ్మశక్యంగా లేదు. టీడీపీని, చంద్రబాబును తిట్టడంలో, అటు వైసీపీ నేతల ఆగడాలను కొమ్ము కాయడంలో సాక్షి మీడియా ముందుంటుంది. ఇటీవల విజయసాయిరెడ్డిపై వరుసగా భూ దందా ఆరోపణలు వస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. అటు సాక్షి మీడియాలో సైతం సపోర్టుగా కథనాలు రావడం లేదు. దీంతో బాధతో ఉన్న విజయసాయి సాక్షిపై ఉన్న అక్కసు రామోజీరావుపై తీర్చుకున్నారన్న టాక్ నడుస్తోంది.

ఇటీవల వైసీపీ అధిష్టానానికి, విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారమైతే ఉంది. తనకిష్టమైన ఉత్తరాంధ్ర సమన్వయ బాధ్యతల నుంచి తప్పించారు. సోషల్ మీడియా వింగ్ బాధ్యతను తన నుంచి తీసుకొని సజ్జల రామక్రిష్ణారెడ్డికి అప్పగించారు. అటు తాను ఏర్పాటుచేసిన జాబ్ మేళాలను తప్పుపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డి కొంత కలత చెందారన్న పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఈనాడులో ప్రభుత్వానికి, వైసీపీ కీలక నేతలకు వ్యతిరేకంగా కథనాలు వస్తే ఏది నిజం? పేరిట సాక్షిలో అన్ని వివరాలతో కథనాలు వస్తాయి. పేజీలకు పేజీలు సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తూ మరీ కౌంటర్లు ఇస్తుంది. అయితే తనపై వచ్చిన కథనాలపై సాక్షి కౌంటర్ ఇస్తుందని మూడు రోజుల పాటు విజయసాయిరెడ్డి వెయిట్ చేశారు. అందుకుఅవసరమైన సమాచారాన్ని సాక్షి ఎడిటోరియల్ స్టాఫ్ కు పంపించారు. అయితే యాజమాన్యం నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయో తెలియదు కానీ.. సాక్షి సిబ్బంది పట్టించుకోవడం మానేశారు. దీంతో వేచిచూసి వేశారిన విజయసాయి మీడియా ముందుకొచ్చారు. చానెల్ పెడతానని ప్రకటించారు.

అయితే విజయసాయి రెడ్డి తాజా ప్రకటన సాక్షినే కలవరపెడుతోంది. చానల్ పెడితే అది సాక్షికి పోటీ అయ్యే అవకాశాలున్నాయి. పత్రిక పరంగా ఈనాడు నంబర్ వన్ స్థితిలో ఉంది. కానీ చానల్ పరంగా ఎక్కడ ఉందో వెతికే స్థితిలో ఉంది. విజయసాయిరెడ్డి మాత్రం పేపరు పెట్టకుండా చానల్ పెడతానని ప్రకటించారు. ఇప్పటికే తొలి అగ్రస్థానాల్లో వైసీపీ అనుకూల మీడియా ఉంది. ఇది రామోజీరావుకు గానీ.. ఈటీవీకి గానీ పోటీ కానేకాదు. కానీ విజయసాయి మాత్రం రామోజీరావు మాటున వైసీపీ అధిష్టానానికి, సాక్షి యాజమాన్యానికి సంకేతాలు పంపినట్టు ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్షి తనను కాపాడలేని స్థితిలో ఉంది.. భవిష్యత్ లో ఇంకా పరిణామాలు జరిగే అవకాశముందని భావించి విజయసాయి ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.