Vijayanagaram District: విజయనగరం జిల్లాలో అధికార పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీ అధినేత జగన్ నిర్ణయాలను తప్పుపడుతూ ద్వితీయ శ్రేణి నాయకులు మీడియా ముందుకొస్తున్నారు. తాజాగా బొబ్బిలి మునిసిపాల్టీకి చెందిన అధికార పార్టీ కౌన్సిలర్ రామారావునాయుడు అధినేత తీరుపై విరుచుకుపడ్డారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఎదురు తిరిగారు. అభివృద్ధి చేయకుండా గడప గడపకు ఎలా వెళ్లగలమని ప్రశ్నించారు. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గడప గడపకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లాలని నిలదీశారు. పేరుకే పథకాలు.. ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని మండిపడ్డారు. తమ బాధ పార్టీలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్ధితి ఏర్పడిందని రామారావు వాపోయారు. జామి మండలంలో వైసీపీ పార్టీకి భారీషాక్ తగిలింది. ఆ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు ముకుంద శ్రీను శుక్రవారం గుడ్‌బై చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారికి విలువ లేకుండా పోయిందని, దీంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన విలేకరులతో ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆభిమానిగా ఉన్న తాను జగన్ పార్టీ ప్రకటించిన నాటినుంచి గెలుపునకు కష్టపడి పనిచేశానని, తనను నమ్ముకున్న కార్యకర్తలు నిస్వార్ధంగా పార్టీకోసం పని చేశారని అన్నారు. తాను, తన అనుచరులు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే కొంతమంది నాయకులు తమపై కుట్రలు చేసి విలువ లేకుండా చేశారని ఆరోపించారు. తమను మానసికంగా హింసించారన్నారు. దీంతో విలువలేని పార్టీలో ఇమడలేక రాజీనామా చేశానని, త్వరలో తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తానని తెలిపారు.
Also Read: Srilnka: శ్రీలంకలా మన పరిస్థితి దిగజారుతుందా? ప్రస్తుత పరిస్థితేంటి?
నాడు క్లీన్ స్వీప్
సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో టీడీపీ నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. కొన్నాళ్ల పాటు స్తబ్దత నెలకొంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. ఎంపీటీసీ ఎన్నికల విషయంలో పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు తెలుగు తమ్ముళ్లు పోటీకి దూరంగా ఉన్నారు. కానీ కీలక నేతల నియోజకవర్గాల్లో బరిలో దిగిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు గణనీయమైన ఎంపీటీసీ స్థానాలు సాధించారు. బొబ్బిలి, కురుపాం, ఎస్.కోట నియోజకవర్గాల్లో సత్తాచాటారు. అసలు టీడీపీ లేదన్న వారికి ధీటైన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వపై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే నేతలు బయటకు వస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీలో సైతం విభేదాలు రాజుకుంటున్నాయి. మరోవైపు పార్టీ అధిష్టానం తీరుపై కూడా నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చాలా మంది పార్టీ మారడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. గడిచిన ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారు తిరుగు ముఖం పట్టడం ఖాయమని తెలుగుదేశం నాయకులు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారు. అదునుచూసి పార్టీలోకి జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపుతున్నారు.
Also Read: Disaster Funds In AP: ఏపీలో విపత్తు నిధులు ఏమయ్యాయి.. సుప్రీం కోర్టు ఆరా