ఒకవైపు నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే మరోవైపు పాల ధరలు సామాన్యులకు ఝలక్ ఇస్తున్నాయి. పాల అమ్మకం ధరను పెంచుతున్నట్టు విశాఖ డెయిరీ యాజమాన్యం నుంచి కీలక ప్రకటన వెలువడింది. లీటర్ పై ఏకంగా రెండు రూపాయలు పెంచుతున్నట్టు విశాఖ డెయిరీ యాజమాన్యం వెల్లడించింది. గతేడాది ఫిబ్రవరి ఒకటవ తేదీన లీటర్ కు రెండు రూపాయలు పెంచిన ప్రభుత్వం ఏడాది తిరగకముందే పాల ధరలను మళ్లీ పెంచడం గమనార్హం.
రోజుకు దాదాపు ఆరు లక్షల లీటర్ల పాలు విక్రయించే విశాఖ డెయిరీ సంస్థ ధరలు పెంచడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు వల్ల వినియోగదారులపై ఏకంగా 12 లక్షల రూపాయల అదనపు భారం పడనుందని తెలుస్తోంది. హోమోజినైజ్డ్ డబుల్ టోన్డు పాలు అరలీటర్ ధర రూ.21 నుంచి రూ.22 కానుండగా టోన్డు పాలు అర లీటరు రూ.23 నుంచి రూ.24, స్టాండర్జైడ్ పాల ధర రూ.25 నుంచి రూ.26, పుల్ క్రీము పాలు రూ.27 నుంచి రూ.28కు పెరిగినట్టు తెలుగుస్తోంది.
విజయ డెయిరీ సంస్థ ధరలు పెంచిన నేపథ్యంలో ఇతర కంపెనీలు సైతం పాల ధరలు పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పెరుగుతున్న ధరల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇలాంటి సమయంలో ధరల పెంపు సరికాదని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు, రేపు ఇతర కంపెనీల నుంచి పాల ధరల పెంపుకు సంబంధించిన ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
రోజురోజుకు ధరలు పెరగడం వల్ల ధనవంతులకు ఎటువంటి నష్టం లేకపోయినా సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు, తక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులు ధరల పెంపు వల్ల ఇబ్బందులు పడుతున్నారు