రాజకీయాల్లో ఆరోపణలు సహజం. పోలవరం ప్రాజెక్టును తెలుగు దేశం పార్టీ అధినేయ చంద్రబాబు, అతని కొడుకు నారా లోకేష్ ఏ రకంగా తమ ఆర్థిక అవసరాల కోసం వాడుకున్నారన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆరోపించడం విశేషం. పోలవరం జాతీయ ప్రాజెక్టు. నిధులు కూడా కేంద్రమే కేటాయిస్తుంది కానీ నిర్మాణాలు మాత్రం రాష్ట్రం చేపడుతుంది. కానీ అంతా కేంద్రం అజమాయిషీలో ఉంటుంది. ఇలాంటి గందరగోళం మధ్య పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు.
ఇలాంటి సమయంలో… “సగం కొట్టుకుపోయిన కాఫర్ డ్యాం కట్టి పోలవరం పూర్తి చేసినట్లు బిల్డప్ ఇచ్చాడు జూమ్ బాబు. నీ ఐదేళ్ళ పాలన కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చడానికే సరిపోయింది బాబు. పోలవరం అసలు డ్యాం పునాదులు కూడా తమరు వేయలేదు. ప్రచారం కోసం స్పిల్ వేపై ర్యాంప్ వాక్ అంటూ డ్రామాలు రక్తి కట్టించావ్..,” ఇదీ తాజాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్న మాట.
ఇక విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నట్లు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాఫర్ డ్యాం సగం కొట్టుకుపోయిన మాట వాస్తవమేనా? అసలు ఇలాంటి ఒక ఆరోపణ చేయడం ఆషామాషీ కాదు. ఇది చాలా సీరియస్ అంశం. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైనది కాఫర్ డ్యాం. అది కొట్టుకుపోయింది అంటే.. “ఇన్ని రోజులు బయటకు రాకుండా ఎలా ఉంది? అసలు అది ఎప్పుడు కొట్టుకుపోయింది? దీనిని ఎవరు దాచి ఉంచారు?” అన్నది తేలాల్సి ఉంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక అది తెలుసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే. అయినా చంద్రబాబు మీద ఆరోపణలు చేసే క్రమంలో విజయసాయి రెడ్డి ఏకంగా కేంద్రాన్ని టచ్ చేసాడు.
పోలవరం చంద్రబాబుది కాదు, కేంద్రానిది కాదు, వైఎస్సార్ ది…. అతని కొడుకు జగన్ ది అసలే కాదు. అది ప్రజల సొమ్ముతో ప్రజల కోసం నిర్మితమవుతున్న ప్రాజెక్టు. అసలు ఇంతటి గొప్ప ప్రాజెక్టు సమీప భవిష్యత్తులో నిర్మితమయ్యే అవకాశమే లేదు. మరి అంత ప్రతిష్టాత్మకంగా భావించాల్సిన పోలవరం ప్రాజెక్టుని దురదృష్టవశాత్తు రాజకీయానికి వాడుకోవడం…. నిజంగా ఎవరు చేయకూడని పని.
అయితే పోలవరం ప్రాజెక్టు ను ఒక పొలిటికల్ అస్త్రంలో ఎప్పటి నుండో రాజకీయ పార్టీలు వాడేస్తూ ఆ ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు సృష్టించాయి. మొదలుపెట్టిన దానిని తమ ప్రభుత్వం పూర్తి చేసి ఆ ఘనత సాధించే ఆలోచనలు మానేసి…. మీ పాలనలో కొట్టుకుపోయింది…. మీ పాలనలో నాశనమైపోయింది…. మీరు డబ్బులు తినేశారు అన్న మాటలు మాట్లాడటం ఎంతవరకు సబబు? ఏదో ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయినట్లు ఈ అరుపులు దేనికి..? తిరిగి పూర్తే చేసి సత్తా చూపించడం మానేసి.. ఈ ఆరోపణలతో ఎవరైనా చేసేది ఏముంది?