
Vibrations in AP with Jana Sena Meeting: అడుగడుగునా జనం.. ఎటుచూసినా జనం.. దారి పొడవునా జనం.. సభా ప్రాంగణంలో జనం.జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ సభలో కనిపించిన దృశ్యాలివి. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నోవాటల్ కు వేదిక మార్చినా, అక్కడ నుంచి వారాహి వాహనంలో బయలుదేరినా ప్రజలు మాత్రం పవన్ ను వీడలేదు. దారిపొడవునా మంగళహారతులు, స్వాగతాలతో సంబ్రమాశ్చర్యాలకు గురిచేశారు. తమ అభిమానాన్ని చాటుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడలో బయలుదేరిన పవన్.. మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి చేరుకోవడానికి రాత్రి 9 గంటలైంది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు పవన్ జనాలను అధిగమించి ఎలా ముందుకెళ్లారో..
ఏపీ నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా భారీగా జనాలు తరలివచ్చారు. వేలాది మంది అభిమానులు ముందురోజే విజయవాడ చేరుకున్నారు. ప్రత్యేక వాహనాల్లో స్వచ్ఛందంగా వచ్చి ముందు రోజు నుంచే విజయవాడ, మచిలీపట్నంతో పాటు అందుబాటులో ఉన్న లాడ్జిలు, హోటళ్లలో బస చేశారు. కొందరు రోజుల తరబడి ముందుగానే వాటిని బుక్ చేసుకున్నారు. అయితే వాహన రాకపోకలతో కృష్ణా జిల్లా మార్మోగింది. ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. రాత్రి సభ ముగిసిన తరువాత కొందరు వెళ్లగా..మరికొందరు ట్రాఫిక్ దృష్ట్యా బుధవారం సాయంత్రం వరకూ తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు.

జనప్రభంజనం జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. మంగళవారం ఉదయం వేలల్లో ఉన్న జనం.. మధ్యాహ్నానికి లక్షల్లో మారారు. సుమారు 10 లక్షల మంది వచ్చినట్టు తెలుస్తోంది. ఒక్క ఎమ్మెల్యే బలం లేకపోయినా పవన్ సభకు జనం పోటెత్తడం జాతీయ మీడియాలో కూడా హైప్ చేస్తోంది. అటు బీజేపీ, కాంగ్రెస్ తో పాటు దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు గమనిస్తున్నాయి. అధికార పక్షంగా వైసీపీ, విపక్షంగా టీడీపీ ఉన్నాయి. కానీ ఆ రెండు పార్టీలకు తలదన్నే రీతిలో జనసేన ఎదుగుతుండాన్ని జాతీయ మీడియా ప్రత్యేకంగా ప్రస్తావించింది. అత్యంత జనాకర్షణ నేతగా పవన్ నిలబడ్డారని గుర్తించింది. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే జనసేన ప్రభంజనంపై వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. లోకేష్ పాదయాత్రతో ముడిపెడుతూ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ ప్రభంజనంతో మీకు గుండెపోటు తప్పదని సెటైర్ వేశారు.
జనసేన ప్రభంజనం చూసి అధికార వైసీపీ కలరవపాటుకు గురవుతోంది. ప్రధానంగా పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నంలో సభ ఏర్పాటుచేయడంతో అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. అటు వైసీపీ కూడా అడ్డుతగిలింది. పోలీస్ యాక్ట్ ను తెరపైకి తెచ్చి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించింది. కానీ జనం విరగబడి వచ్చేసరికి పునరాలోచనలో పడింది. అందుకే అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంది. ఎటువంటి కవ్వింపు చర్యలు చేపట్టినా అది ప్రభుత్వం మెడకు చుట్టుకునే అవకాశముండడంతో వెనక్కి తగ్గింది. అయితే ప్రభుత్వం ఊహించిన దానికంటే జనాలు ఎక్కువగా వచ్చారని నిఘా వర్గాలు నివేదికలు అందించాయి. దీంతో అధికార పక్షంలో కలవరం ప్రారంభమైంది. జనసేన ప్రభంజనం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.