
Jana Sena: అనుకున్నదే నిజమవుతోంది. ఒక సభతో ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. జనసేన ఎక్కడుందని ప్రశ్నించే వారి మదిలో గుబులు రేగుతోంది. జనసేన ఒక పార్టీయేనని గుర్తించడం ప్రారంభిస్తున్నారు. ఇది మరింత ముదిరితే మాత్రం ఏపీలో సమూలంగా రాజకీయాలు మారిపోతాయి. అటు అధికార పక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షం అన్నింటిలోనూ కదలిక మొదలైంది. పవన్ తమను నష్టం చేస్తాడని అధికార పక్షం, కలుపుకొని వెళ్లకపోతే తమకు మరోసారి భంగపాటు తప్పదని ప్రధాన ప్రతిపక్షం భావిస్తోంది. దీంతో రెండు పార్టీలకు తన పదో ఆవిర్భావ సభ ద్వారా చుక్కులు చూపించగలిగారు పవన్ కళ్యాణ్.
అదే సమయంలో బీజేపీకి సైతం స్పష్టమైన సంకేతాలు పంపారు. తాను హైకమాండ్ పెద్దలకు దూరం కాలేదని.. రాష్ట్ర నాయకులే కారణమని చెప్పుకొచ్చారు. వారి వైఖరి వల్లే బలపడలేకపోయామని.. టీడీపీ అవసరం లేకుండా చేసుకోలేకపోయామని ఢిల్లీ పెద్దలకు అర్ధమయ్యే రీతిలో చెప్పారు. తమ రూట్లోకి వస్తే సరి.. లేకుంటే మాత్రం ఉనికి కూడా దక్కదని హెచ్చరికలు పంపారు. ముస్లింలపై దాడులు కొనసాగిస్తే బీజేపీని వదులుకోవడానికి కూడా వెనుకాడబోనని బంతిని ఢిల్లీ పెద్దల కోర్టులోకి పంపగలిగారు.

మరోవైపు తెలుగు దేశం పార్టీకి కూడా అవే సంకేతాలు ఇవ్వగలిగారు. తాను గెలుస్తానని భావించిన చోటే పోటీచేస్తానని కూడా చెప్పుకొచ్చారు. పార్టీకి, ఎమ్మెల్యేలకు గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని చెప్పడం ద్వారా ఇక నుంచి తనకు పార్టీయే అల్టిమేట్ అని గట్టి హెచ్చరికలే పంపారు. ఎక్కడ సంఖ్య బయటపెట్టకుండా బలం అన్న పదాన్ని మాత్రమే వాడారు. తన అవసరం ఎక్కువగా టీడీపీకి ఉందని తన సభతో ఘాటుగా చెప్పారు. అదే సమయంలో బీజేపీని హెచ్చరించే సమయంలో టీడీపీ అవసరం లేనంతగా ఎదగలేకపోయామని చెప్పడం ద్వారా పొత్తులకు స్పష్టమైన సంకేతాలు పంపారు.
ఇప్పటికే లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. జన సమీకరణతో పర్వాలేదనిపిస్తోంది. అయితే పవన్ సభతో మాత్రం పోల్చుకుంటే వెలవెలబోతోంది. కానీ సుదీర్ఘ పాదయాత్ర కావడంతో అదే మాదిరిగా కొనసాగుతుందని… ప్రతీరోజూ జన సమీకరణ చేయడం కుదరదని విశ్లేషకులు చెబుతున్నాయి. అయితే నాలుగు దశాబ్దాల పార్టీ ఎటువంటి కార్యక్రమం చేపట్టినా జన సమీకరణ చేయాల్సి వస్తోంది. కానీ దశాబ్దం నిండిన పార్టీ, ఇపై పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న పార్టీ లో కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు రావడం చర్చనీయాంశమవుతోంది.అందుకే ఇప్పుడు జనసేన అవసరం టీడీపీకే ఎక్కువ ఉందన్న వాదన వినిపిస్తోంది. జనసేన పదో ఆవిర్భావ సభ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంచలనాలకు వేదికగా మారింది.