Venkaiah Naidu: ఉపరాష్ర్టపతి అభ్యర్థి ఎవరనేదానిపై మళ్లగుల్లాలు పడుతున్నారు. ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. అన్ని ఈక్వేషన్లు చూస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఉపరాష్ర్టపతి విషయంలో మాత్రం ఎటూ తేల్చలేకపోతున్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం ఉపరాష్ట్రపతి విషయంలో అన్ని దారుల్లో సమాలోచనలు చేస్తున్నారు. ఎవరిని ఎంపిక చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. రాబోయే ఎన్నికలకు రెఫరెండంగా ఉండాలని భావిస్తున్నారు.

ఈ దశలో వెంకయ్య నాయుడునే కొనసాగిస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా దీర్ఘాలోచన చేస్తున్నారు. వెంకయ్య అయితేనే పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. దక్షిణాదిలో పార్టీ పుంజుకుంటున్న తరుణంలో అక్కడి వారికి పెద్దపీట వేస్తేనే మనకు ఓటు బ్యాంకు పెరుగుతుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వెంకయ్య అభ్యర్థిత్వానికే ఓటు వేయనున్నట్లు సమాచారం. అదే తరుణంలో కొత్త వారికి ఇస్తే ఫలితం ఎలా ఉంటుందనే కోణంలో ఆరా తీస్తున్నారు. రాష్ట్రపతిగా మహిళ ఉండటంతో ఉపరాష్ట్రపతిని కూడా మహిళను చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా ఓ చర్చ జరుగుతోంది. దీంతో తెలంగాణ గవర్నర్ తమిళిసైని తీసుకుంటే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచనలో పడుతోంది. దీంతో పాటు చాలా మంది పేర్లు బయటకు వస్తున్నా దేని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం లేదు.
Also Read: Draupadi Murmu Telangana Tour Cancelled: తెలంగాణను అవమానిస్తున్న బీజేపీ.. ఇలా రివేంజ్ నా?
మైనార్టీని తీసుకోవాలనే ఆలోచనలో కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీకి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినా దానికి బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఒప్పుకోవడం లేదు. దీంతో ఆయనకు అవకాశం ఇవ్వకపోవచ్చనే తెలుస్తోంది. ఇంకా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర మాజీ మంత్రులు సురేష్ ప్రభు, ఎస్ఎస్ అహ్లువాలియా, పెట్రోలియం శాఖ మంత్రి హల్దీప్ సింగ్ పురీ, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ల పేర్లు వినిపించినా ఎవరికి కూడా మొగ్గు చూపడం లేదు.

ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన వెంటనే 19 నుంచి ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపరాష్ట్రపతి పదవికి కావాల్సిన బలం బీజేపీకి ఉంది. దీంతో పోటీ ఉండదనే తెలుస్తోంది. ప్రతిపక్షాలు పోటీ చేసినా వారికి సంఖ్యాబలం లేదు. అందుకే బీజేపీ ప్రతిపాదించిన వ్యక్తికే విజయావకాశాలు ఉంటాయని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరిని నిలబెడతారో అనే ఉత్కంఠ అందరిలో వస్తోంది. ఇప్పటికైతే ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపడం లేదని సమాచారం. బీజేపీలో ఇంకా ఏం నిర్ణయాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.