Vangaveeti Radhakrishna: వచ్చే ఎన్నికల్లో పోటీకి వంగవీటి రాధాకృష్ణ సిద్ధపడుతున్నారా? అయితే ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారా? లేకుంటే పార్లమెంట్ స్థానానికా? ఏపీ పొలిటికల్ సర్కిల్ ఇదే చర్చ నడుస్తోంది. ఎన్నికల సమీపిస్తుండడంతో ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాధా టీడీపీలోనే ఉన్నారు. జనసేనలో చేరుతారని భావించినా..మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఎక్కడి నుంచి బరిలో దిగాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అనుచరులు, అభిమానుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికలకు ముందు వంగవీటి రాధా వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఆశించినా వైసీపీ నాయకత్వం మొండి చేయి చూపించింది. దీంతో ఆయన అనూహ్యంగా టిడిపి గూటికి వచ్చారు. చంద్రబాబు ఆయనకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. కానీ టిడిపి అధికారంలోకి రాలేదు. గత నాలుగేళ్లుగా టిడిపిలోనే ఉన్నారు. ఇటీవల యాక్టివ్ అయ్యారు. లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా తరచూ కనిపిస్తున్నారు. దీంతో ఆయన టిడిపిలో కొనసాగుతారని అంతా భావిస్తున్నారు.మధ్యలో జనసేనలో చేరుతారని భావించినా.. ఎందుకో వెనక్కి తగ్గారు. టిడిపి, జనసేన మధ్య పొత్తు కారణంగానే ఆయన పునరాలోచనలో పడినట్లు సమాచారం.
విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో టికెట్ దక్కే అవకాశం లేదు. దీంతో రాధాను మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు.ఈ మేరకు రాధాను ఒప్పించినట్లు సమాచారం.మచిలీపట్నం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువ. దీనికి జనసేన బలం తోడు కానుంది. ఇక్కడ కానీ పోటీ చేస్తే గెలుపు ఖాయం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. రాధా పోటీ చేస్తే వంగవీటి మోహన్ రంగా ఫ్యాక్టర్ పనిచేస్తుందని టిడిపి నాయకత్వం భావిస్తుంది.
అయితే విజయవాడ నగరంలోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలన్నది రాధా ఆలోచన. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఇప్పటికే అక్కడ బలమైన అభ్యర్థి టిడిపికి ఉన్నారు. గతంలో అసెంబ్లీ టికెట్ స్థానాన్ని ఆశించి రాకపోవడంతో రాధా వైసిపిని వీడారు. అందుకే టిడిపి నాయకత్వం ముందు జాగ్రత్త పడింది. ముందుగా రాధా అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే రాధా తన అనుచరులు, అభిమానులతో వరుసగా సమావేశం అవుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో రాధ ఎక్కడి నుంచి బరిలో దిగుతారో క్లారిటీ రానుంది.