Undavalli Sridevi: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పొలిటికల్ కెరీర్ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఆమె వైసీపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హై కమాండ్ కు నమ్మిన బంటుగా వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ లేకపోవడంతో.. ఆమె వైసీపీకి వ్యతిరేకంగా పావులు కదిపారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి ఓటేశారన్న కారణంతో వైసీపీ నుంచి బహిష్కరణ గురయ్యారు. టిడిపిలో చేరతారని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే శ్రీదేవి ప్రస్తుతం పావులు కదుపుతున్నారు.
శ్రీదేవి తొలుతా జనసేనలో చేరతారని అంతా భావించారు. కానీ సడన్ గా శ్రీకాకుళం టూర్ లో ఉన్న చంద్రబాబును భర్తతో కలిశారు. ఇది చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టిడిపి నుంచి ఆమె పోటీకి సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసమే ఆమె చంద్రబాబును కలిశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆమెకు తాడికొండ సీటు దక్కే అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. అక్కడ టిడిపికి బలమైన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు. 2014లో గెలిచిన ఆయన.. 2024లో పోటీకి సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో శ్రీదేవి టిడిపిలో చేరినా టికెట్ దక్కే ఛాన్స్ లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
అంతకుమించి వైసీపీకి బలమైన అభ్యర్థి అక్కడ దొరికారు. 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయనను ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థి టిడిపికి అవసరం. ఒకవేళ శ్రావణ్ కుమార్ పోటీ చేసినా.. ఉండవల్లి శ్రీదేవిని తీసుకుంటే పార్టీకి మైలేజ్ వస్తుందని టిడిపి నాయకత్వం భావిస్తోంది. శ్రీదేవికి నామినేటెడ్ పదవి కేటాయించేందుకు చంద్రబాబు సమ్మతించినట్లు తెలుస్తోంది.