Vangaveeti Radhakrishna: వంగవీటి రాధాకృష్ణ వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయన కోసం కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ ప్రయత్నిస్తున్నారని కూడా టాక్ నడిచింది. నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి ఎంటర్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఏకంగా ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు కూడా మీడియాకు లీకులు ఇచ్చారు. వైసిపి అనుకూల మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం ఎంత ఉందో తెలియడం లేదు. కానీ రాధాకృష్ణ మాత్రం ఎక్కడా మాట్లాడడం లేదు. ఆయన చర్యలు సైతం అటువైపుగా లేవు. కానీ వైసిపి అనుకూల మీడియా ఎందుకు అలా ప్రచారం చేసిందో తెలియడం లేదు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక దాదాపు లేనట్టే. ఆయన ఆశిస్తున్న సీట్లలో ఇప్పటికే వైసీపీ హై కమాండ్ అభ్యర్థులను ప్రకటించింది. కేవలం ముద్రగడకు రాజ్యసభ సీటు ఇస్తామని మాత్రమే తేల్చి చెప్పింది. దీంతో ముద్రగడ మనసు మార్చుకున్నారు. జనసేనలో చేరేందుకు కసరత్తు చేస్తున్నారు. అటు టిడిపి పట్ల కూడా సానుకూలంగా మారిపోయారు. ఇటువంటి తరుణంలో బలమైన కాపు నేపథ్యం ఉన్న వంగవీటి రాధాకృష్ణను తమ వైపు తిప్పుకోవాలని వైసిపి భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎంత నిజం ఉందో మాత్రం తెలియడం లేదు. రాధాకృష్ణకు వైసిపి కీలక నేతలు టచ్ లోకి వచ్చినట్లు ప్రచారం జరిగింది.
ఎన్నికల సమీపిస్తుండడంతో రాధాకృష్ణ తన యాక్టివిటీస్ ను పెంచారు. రాజకీయాలు చేయడం ప్రారంభించారు. అయితే ఆయన చర్యలు చూస్తుంటే టిడిపిలోనే కొనసాగుతారని తెలుస్తోంది. టిడిపి నుంచి వెళ్లిపోతారని భావించిన రాధాకృష్ణ.. ఇప్పుడు వైసీపీ నుంచి చాలామంది నేతలను టిడిపిలోకి రప్పించేందుకు ప్రయత్నిస్తుండడం విశేషం. విజయవాడ వైసిపి అధ్యక్షుడు బొప్పన భవకుమార్ గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్నారు. ఆయనను నేరుగా కలిసిన రాధాకృష్ణ టిడిపిలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భవకుమార్.. ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ హై కమాండ్ దేవినేని అవినాష్ కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో భవకుమార్ మనస్తాపానికి గురయ్యారు. పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న రాధాకృష్ణ భవ కుమార్ తో చర్చలు జరపడం విశేషం. టిడిపిలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ గెలవకూడదు అన్నది రాధాకృష్ణ భావన. అందుకే ఆయన పావులు కదుపుతున్నారు.
రాధాకృష్ణ విషయంలో వైసిపి మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఆశించిన రాధాకృష్ణకు జగన్ షాక్ ఇచ్చారు. అప్పుడే పార్టీలో చేరిన మల్లాది విష్ణుకు కేటాయించారు. మనస్తాపంతో రాధాకృష్ణ పార్టీకి దూరమయ్యారు. టిడిపిలో చేరారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం వంగవీటి రాధను మళ్ళీ వైసీపీలోకి రప్పించాలని జగన్ ప్లాన్ చేశారు. అయితే ఇప్పటికే పార్టీలు మారి రాధాకృష్ణ మూల్యం చెల్లించుకున్నారు. అందుకే మరోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని భావిస్తున్నారు. విజయవాడ వైసిపి నగర అధ్యక్షుడిని టిడిపిలోకి రప్పించడానికి ప్రయత్నిస్తుండడం ద్వారా.. వైసిపి మైండ్ గేమ్ కు రాధాకృష్ణ చెక్ చెప్పినట్లు తెలుస్తోంది.