Vangaveeti Radha
Vangaveeti Radha: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సామాజిక సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.పవన్ ద్వారా కాపులు టిడిపి, జనసేన వైపు టర్న్ కావడంతో జగన్ అలెర్ట్ అయ్యారు. ప్రతిపక్షాలు ఏకమై తన ఓటమికి ప్రయత్నిస్తున్న వేళ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. వంగవీటి రాధాకృష్ణను వైసీపీలోకి రప్పించేందుకు భారీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
వైసీపీ ఆవిర్భావం నుంచి వంగవీటి రాధాకృష్ణ జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ సీటు ఇచ్చినా రాధాకృష్ణ గెలవలేకపోయారు. గత ఎన్నికల్లో రాధాకృష్ణ కోరుకున్న సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. అయినా సరే టిడిపి గెలవలేదు. అప్పటినుంచి అదే పార్టీలో కొనసాగుతున్నా.. యాక్టివ్ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉన్నారు. ఇప్పుడు మారుతున్న సమీకరణలతో వైసీపీ సీనియర్లు రాధాకృష్ణకి టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పటికే రాధాని వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు. అటు జనసేన నుంచి సైతం రాధాకు ఆహ్వానం ఉంది. దీంతో రాధా రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయోనని చర్చ నడుస్తోంది.
నిర్ణయాలు తీసుకోవడం లో తప్పటడుగులు వేయడం, అంచనాలు తప్పడంతో 2009 నుంచి పవర్ పాలిటిక్స్ కు రాధాకృష్ణ దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని తెలియక టిడిపికి జంప్ చేశారు. 2009లో కూడా ఇదే తప్పిదానికి పాల్పడ్డారు. రాజశేఖర్ రెడ్డి వద్దని వారించినా ప్రజారాజ్యం పార్టీలో చేరారు. వైసీపీలోకి వచ్చినా ఇక్కడ కూడా ఇమడలేకపోయారు. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత రాధాకృష్ణ పై ఉంది. కచ్చితంగా ఆయన వైసీపీలో చేరారని అనుచరులు చెబుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తమ ప్రయత్నాలు వీడడం లేదు. వైసీపీలోకి వస్తే మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని కేటాయిస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా జగన్ సన్నిహితుడు బాలశౌరి ఉన్నారు.
అయితే రాధా పార్టీ మారడానికి సిద్ధపడతారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి ఆయన విజయవాడ సెంట్రల్ సీటును ఆశించారు. వైసిపి ఇవ్వకపోయేసరికి టిడిపిలోకి వచ్చారు. ఇప్పుడు అదే స్థానానికి టిడిపి అభ్యర్థిగా బోండా ఉమా ఉన్నారు. వైసిపి టిక్కెట్ ను వెల్లంపల్లి శ్రీనివాస్ కు కేటాయించారు. మరోవైపు విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. కృష్ణాజిల్లాలో విజయవాడ తరువాత పార్లమెంట్ స్థానంగా ఉన్న మచిలీపట్నం ఆఫర్ ను వంగవీటి రాధాకృష్ణ స్వీకరిస్తారా? తిరస్కరిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.