Vanama Vs Jalagam: కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై అదే పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు గెలిచిన కేసు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండవ స్థానంలో ఉన్న జలగం వెంకట్రావే అప్పటినుంచీ ఎమ్మెల్యే అని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2018 ఎన్నికల్లో వనమా సహా కాంగ్రెస్ తరపున గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు మూడింట రెండు వంతుల నిబంధన పేరుతో శాసనసభా పక్షంగా ఏర్పడి భారత రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీలో విలీనమైన ప్రక్రియ చెల్లుతుందా లేదా అనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.
2018 ఎన్నికల్లో 19 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా కొలువుదీరింది. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, హరిప్రియ, రేగా కాంతారావు, రోహిత్ రెడ్డి తదితర 12 మంది ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితికి దగ్గరయ్యారు. 2019 లోక్ సభ కళ్ళు నల్లగొండ స్థానం నుంచి ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజూర్నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో సాంకేతికంగా శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 18కి పడిపోయింది. అదునుగా భారత రాష్ట్ర సమితి దగ్గరైన వనమా సహ 12 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నుంచి చీలిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గా కొనసాగుతున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం 18 మందిలో రెండు వంతులు 12 మంది చీలిపోయి విలీనం కావచ్చని అప్పట్లో అధికార పార్టీ నేతలు వాదించారు. అయితే ఆ 12 మందిలో వనమా ఎన్నిక చెల్లదని, 2018 నుంచి కొత్తగూడెం నియోజకవర్గానికి జలగం వెంకట్రావే ఎమ్మెల్యే అని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో విలీనం అయినా ఎమ్మెల్యేల సంఖ్య 11 కు చేరుకుంది. తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు నెలరోజుల గడువు ఇవ్వాలంటూ వనమా వెంకటేశ్వరరావు పెట్టుకున్న పిటిషన్ నూ హైకోర్టు తోసిపుచ్చింది. తాను ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల కమిషన్ కు, అసెంబ్లీకి పంపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 11 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఎంపీలు విలీనం కావడం చెల్లుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
కోర్టు ఉత్తర్వులు అటు ఎన్నికల కమిషన్ కు, ఇటు అసెంబ్లీకి చేరినప్పటికీ ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు ప్రమాణస్వీకారం జరగలేదు. హై కోర్టు తీర్పు పై వనమా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని తోంది. సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించి హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తే అటు ప్రభుత్వానికి, ఇటు వనమా వెంకటేశ్వరరావుకు ఊరట లభించినట్టు అవుతుంది. అయితే ఈలోపే జలగం వెంకట్రావు సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో జలగం ప్రమాణ స్వీకారం లో జాప్యం జరుగుతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గురువారం శాసనసభ వర్షాకాల సమావేశాలకు ఎవరు వస్తారు? వనమా వెంకటేశ్వరరావు వస్తారా? జలగం వెంకట్రావు వస్తారా? ఇదీ సమావేశాల షెడ్యూల్ వెలువడిన రోజు నుంచి సామాజిక మాధ్యమాల్లో జరిగిన చర్చ. అయితే గురువారం ఇద్దరూ కూడా కనిపించలేదు. అఫిడవిట్లో తప్పుడు వివరాలు సమర్పించారని కారణంతో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఎన్నికను రద్దు చేస్తూ జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా గుర్తించాలని హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును అమలు చేసే బాధ్యత అసెంబ్లీ స్పీకర్ దే. ఈ మేరకు జలగం వెంకట్రావు స్పీకర్ ను కోరినప్పటికీ తీర్పు అమలులోకి రాలేదు. దీంతో ఉత్కంఠ కొనసాగుతోంది.