Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇటీవల సైలెంట్ అయ్యారు. ఆయన ఎక్కడా అధికార పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. టీడీపీ నుంచి గెలిచిన వంశీ ఆ పార్టీ పెద్దలపైనే తిరుగుబాటు చేశారు. తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైసీపీ గూటికి చేరారు. ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అసహనం వ్యక్తం చేశారు. తన అసంతృప్తిని బాహటంగానే బయటపెట్టారు. నిర్ణయంపై ఒకసారి పునరాలోచించుకోవాలని జగన్ కు లేఖ రాశారు. అప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. అటు అనుచరులకు సైతం దూరంగా ఉన్నారు.దీంతో ఆయన కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారని ప్రచారం సాగింది. నియోజకవర్గంలో అసమ్మతి నేతలు యార్లగడ్డ వెంకటరావు,దుట్ట రామచంద్రరావు వర్గాలు స్పీడు పెంచడం, అధిష్టానం ఆశించిన స్థాయిలో భరోసా కల్పించకపోవడంతో కలత చెందారు. అలాగని టీడీపీలోకి యూటర్న్ అవుదామంటే నాయకత్వంపై స్థాయికి మించి వ్యాఖ్యలు చేశారు. అందుకే రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరిగింది.

అటు సీఎం జగన్ నిర్వహించిన కృష్ణా జిల్లా సమీక్షకు వల్లభనేని వంశీ హాజరుకాలేదు. అటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం గైర్హాజరయ్యారు. సమీక్షలో గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో గన్నవరం వెనుకబడి ఉందని సీఎం జగన్ ప్రస్తావించారు. ఎందుకు వెనుకబడి ఉన్నారని ప్రాంతీయ సమన్వయకర్తలను సైతం ప్రశ్నించారు. అక్కడ పార్టీ పరిస్థితిపై జగన్ ఓకింత అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం సాగింది. అటు వల్లభనేని వంశీ కనిపించకపోవడం, ఇటు సీఎం అసహన వ్యాఖ్యలతో గన్నవరం సమీక్ష హాట్ టాపిక్ గా మారింది. వల్లభనేని పొలిటికల్ కెరీర్ దాదాపు ముగిసినట్టేనని వ్యాఖ్యలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగా వంశీ కూడా తాను టీడీపీకి అనవసరంగా దూరమయ్యానని అనుచరుల వద్ద పశ్చాత్తాపం పడినట్టు వార్తలు వచ్చాయి. అటు వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయాల నుంచి వైదొలగడమే శ్రేయస్కరమన్న నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరిగింది.

గన్నవరం ఎపిసోడ్ లో కొడాలి నాని సైతం మనస్తాపం చెందారన్న వార్తలు వచ్చాయి. టిక్కెట్ భరోసా కల్పించి వంశీని తెస్తే ఇప్పుడు ఇలా వ్యవహరించడం తగదని అధిష్టాన పెద్దల వద్ద కొడాలి నాని పంచాయితీ పెట్టినట్టు తెలుస్తోంది. అసలుకే ఎసరు వస్తుందని భావించిన అధిష్టాన పెద్దలు విషయాన్ని సీఎం జగన్ చెవిలో వేశారు.దీంతో అప్రమత్తమైన సీఎం వంశీని పిలిపించారు. నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. దీనికి సంతోషించిన వంశీ వారం రోజుల్లో కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తాజాగా సీఎం జగన్ పిలుపుతో వల్లభనేని రాజకీయాల నుంచి వైదొలుగుతానన్న నిర్ణయం పక్కన పడేసినట్టేనని అనుచరులు చెబుతున్నారు.