YCP Ministers- Pawan Kalyan: ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ విరుచుకుపడుతున్నారు. ప్రజల మధ్య ప్రాంతీయ విధ్వేషాలు రగల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకీ గర్జనలు పేరిట సుమారు పాతిక ట్విట్లలో వైసీపీ పాలకులను ప్రశ్నించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే అవన్నీ నిజాలే కనుక.. స్పందించలేని వైసీపీ నేతలు తమకు తెలిసిన వ్యక్తిగత దాడినే ఎంచుకున్నారు. పవన్ పాలసీలపై, వైఫల్యాలపై ప్రశ్నిస్తే తట్టుకోలేక వ్యక్తిగత జీవితంపై, కుటుంబ సభ్యులను తెరపైకి తెచ్చి బూతులు తిడుతున్నారు. తమకు అవి తప్ప ఏమీ చేతకావని మరోసారి నిరూపించుకున్నారు. పవన్ నుంచి ఇంతలా రియాక్షన్ వస్తుందని తెలియక వైసీపీ నేతలకు మైండ్ బ్లాక్ అయ్యింది. పవన్ అడిగిన ప్రశ్నల్లో ఒక దానికి కూడా నేరుగా సమాధానం చెప్పకుండా విశాఖ క్యాపిటల్ రాజధాని వద్దంటూ ప్రకటన చేసే దమ్ము పవన్ కు ఉందా అని కొత్త పల్లవి అందుకున్నారు. పవన్ లేవనెత్తిన ప్రశ్నలకు.. మంత్రులు చేస్తున్న ఆరోపణలకు ఎక్కడ సింక్ కావడం లేదు. పవన్ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎక్కడా అని మాట్లాడారు. కానీ దాని గురించి మంత్రుల కనీస ప్రస్తావన లేదు. కేవలం తమకు తెలిసిన డైవర్టింగ్ వ్యాఖ్యలు చేసి చేతులు దులుపుకున్నారు.

పవన్ ఎప్పుడు రంగంలోకి దిగినా వైసీపీ నేతలకు ఒక అలవాటు ఉంది. కాపు సామాజికవర్గం మంత్రులను ఎంటరవుతారు. పవన్ ఇలా ట్విట్లు చేశారో లేదో.. తొలుత మంత్రి గుడివాడ అమర్నాథ్ సీన్ లోకి వచ్చారు. తరువాత అంబటి రాంబాబు.. ఆ తరువాత వరుసగా కాపు సామాజికవర్గం మంత్రులే మాట్లాడారు. పవన్ లేవనెత్తిన అంశాలు కాకుండా అన్నీ మాట్లాడేశారు. తమకు అలవాటైన మాటగా.. చంద్రబాబు కోసమే పవన్ మాట్లాడారని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడని కూడా అరిగిపోయిన రికార్డునే మళ్లీ మళ్లీ చెప్పేప్రయత్నం చేశారు. చంద్రబాబుకు లింకు పెట్టి డైవర్డు చేస్తే అసలు సమాధానం చెప్పాల్సిన పనిలేదనుకున్నారో ఏమో కానీ… లేకి మాటలు మాట్లాడి బేల తనాన్ని చూపించుకున్నారు.

అయితే వైసీపీ తీరు ఆది నుంచి ఇలానే ఉంది. అందుకే ఆ పార్టీ ప్రజల్లో కూడా పలుచన అవుతోంది. సోషల్ మీడియా, ఇంటా, బయట అంతా చర్చ జరుగుతోంది. ఎవరైనా వైఫల్యాలపై ప్రశ్నిస్తే ఎదురు దాడికి దిగడం ఆ పార్టీకి రివాజుగా మారింది. పై స్థాయి నుంచి కింది స్తాయి వరకూ అదే పంథా. ప్రశ్నిస్తే తట్టుకోలేరు. వ్యక్తిగత దాడులకు దిగుతారు. బండబూతులు తిడతారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటకు వచ్చినప్పుడు డైవర్టింగ్ పాలిటిక్స్ కు దిగుతారు. ప్రజలను డైవర్షన్ చేసేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఆదిలో ఈ వ్యూహం బాగానే వర్కవుట్ అయినా.. ప్రజలకు కూడా అంతా అర్థమైంది. ఇప్పుడు వైసీపీ నేతలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో కూడా ప్రజలకు క్లీయర్ కట్ గా తెలిసిపోతోంది. ఇప్పుడు తాజాగా పవన్ వ్యాఖ్యలపై వారి ధోరణి ని ప్రజలు ఏవగించుకుంటున్నారు.