
Minister Seediri Appalaraju: ఏపీలో త్వరలో మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న టాక్ నడుస్తోంది. బడ్జెట్ సమావేశాల తరువాత విచారణ ఉంటుందని.. ఓ నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారిని తీసుకుంటారన్న ప్రచారం వైసీపీలో ఉంది. మొన్న జరిగిన వైసీపీ సర్కారులో ఇటువంటి సంకేతాలే వచ్చాయి. కొందరు మంత్రులు పదవిలో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పాటు అమాత్య పదవితో బిజీగా ఉండి నియోజకవర్గాల్లో వెనుకబడిపోతున్నారని ఐ ప్యాక్ టీమ్ గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఆ నలుగురు ఎవరనేది ఇప్పుడు చర్చగా మారింది. అయితే ఇటువంటి జాబితాలో వినిపిస్తున్న తొలిపేరు డాక్టర్ సీదిరి అప్పలరాజు. లక్కీ మినిస్టర్ గా అప్పలరాజుకు పేరుంది. తాజా మంత్రివర్గ విస్తరణలో ఆయన్ను తప్పించడం ఖాయంగా తెలుస్తోంది.
డాక్టర్ అప్పలరాజు పలాస నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో సీనియర్ నాయకుడు గౌతు శివాజీ కుమార్తె శిరీషపై గెలుపొందారు. అయితే జగన్ కేబినెట్ లో ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణను జగన్ రాజ్యసభకు పంపారు. దీంతో సేమ్ సామాజికవర్గానికి చెందిన అప్పలరాజుకు అనూహ్యంగా పదవి వరించింది. పశుసంవర్థక శాఖను అప్పగించారు. అయితే ఎన్నికల అనంతరం ఏడాది తరువాత అప్పలరాజుకు ఎంపిక చేయడంతో మొన్న విస్తరణలో కొనసాగింపు లభించింది. అయితే తాజా విస్తరణలో మాత్రం ఆయనపై వేటు ఖాయమన్న ప్రచారం జోరుగా నడుస్తోంది.
మంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత అప్పలరాజు పార్టీ కేడర్ ను నిర్లక్ష్యం చేశారన్న టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో మంత్రి వ్యతిరేక వర్గం స్ట్రాంగ్ అవుతోంది. అసమ్మతి నాయకులను దారికి తెచ్చుకోవడంలో అప్పలరాజు ఫెయిలయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్ట్రాంగ్ గా వ్యవహరించారని.. మంత్రి అయిన తరువాతే వీక్ అయిపోయారని ఐ ప్యాక్ బృందం గుర్తించి హైకమాండ్ కు నివేదించినట్టు సమాచారం. ఆ నివేదికను ఆధారంగా చేసుకునే అప్పలరాజును తప్పించనున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతోంది.

అదే కానీ జరిగితే మంత్రి అప్పలరాజుకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. బలమైన కళింగ సామాజికవర్గానికి టిక్కెట్ కేటాయించాలని ఆ సామాజికవర్గం వారు కోరుతూ వస్తున్నారు. అసమ్మతి నాయకులు కూడా అదే స్లోగన్ తో ముందుకు సాగుతున్నారు. అటు అసమ్మతి నాయకులకు టీడీపీ ప్రోత్సాహమిస్తోంది. అటు నియోజకవర్గ ప్రజల్లో కూడా మంత్రిపై ఒకరకమైన అసంతృప్తి నెలకొంది, చెప్పకోదగ్గ అభివృద్ధి లేకపోవడం మైనస్ గా మారింది. అటు సొంత పార్టీ శ్రేణులు కూడా మంత్రి వైఖరిని వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి పదవి ఊడితే మాత్రం అసమ్మతి రాజకీయం మరింత చుట్టుముట్టే చాన్స్ కనిపిస్తోంది.

