
AP Employees: వేతన జీవులు గుర్తించుకునేది ఒకటో తారీఖు. అదే తేదీన బ్యాంక్ ఖాతాల్లో జీతాలు జమ అవుతాయి. పాలవాడి నుంచి పేపరు బిల్లుల దాకా.. రేషన్ షాపు నుంచి పిల్లల ఫీజుల వరకూ అదే తేదీన చెల్లింపులు చేస్తారు. ఆర్థికపరమైన అన్ని అంశాలు అదే తేదీ చుట్టూ తిరుగుతుంటాయి. అందుకే ఉద్యోగులు ‘అమ్మో ఒకటో తారీఖు’ అని సంబోధిస్తారు. అయితే అంతటి ప్రాధాన్యం కలిగిన ఒకటో తారీఖు చరిత్రను జగన్ సర్కారు చెరిపేసింది. ఆ తేదీన చెల్లించాల్సిన జీతాలను నెలలో మూడో వారంలో చెల్లిస్తోంది. పింఛనుదారులకు చుక్కలు చూపిస్తోంది. శేష జీవితంలో ఉండే వారు పింఛను మొత్తం ఆసరా. మందుల నుంచి రోజువారి ఖర్చుల వరకూ అదే వారికి ఆధారం. వారికి కూడా నెలల మూడో వారం దాటితే కానీ చెల్లించలేని స్థితికి ఏపీ సర్కారు జారుకుంది. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు స్పందించారు. జగన్ సర్కారు చర్యలను తప్పుపట్టారు. ఉద్యోగుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై దుయ్యబట్టారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని రఘురామరాజు ఆరోపించారు. అన్నిరకాల ఉత్పత్తులు, వస్తువులు, సేవలపై గణనీయంగా పన్నులు పెంచారని గుర్తుచేశారు. అటువంటప్పుడు ప్రభుత్వానికి గుంపగుత్తిలో ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అటువంటప్పుడు ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం ఏమిటి? పథకాలకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం ఏమిటి? అని రఘురామ ప్రశ్నలవర్షంకురిపిస్తున్నారు. జీతాల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఉద్యోగుల సిబిల్ రేటింగులు దెబ్బతింటున్నాయని గుర్తుచేశారు. 90 శాతం మంది నెలవారీ జీతంపై ఆధారపడుతున్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. నెలాఖరులో కానీ.. వచ్చేనెలా ప్రారంభంలో కానీ జీతాలు చెల్లించకపోతే ఎలా అని నిలదీశారు.

ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు చేసిన విధులకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణ చర్యగా రఘురామ అభివర్ణించారు. జీతాలు సకాంలో రాక చాలామంది ఉద్యోగులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం పదో తేదీలోగా జీతాలు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. జీతాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. ఒకటో తేదీ జీతాలు ఇప్పించండి అని గవర్నర్ ను కోరేదాకా పరిస్థితి వచ్చిందంటే ఏపీలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందన్నారు. అయితే ఈ సంక్షోభం ప్రభుత్వం సృష్టించిందేనని రఘురామ తేల్చేశారు. పన్నుల పెంపు రూపంలో ఆదాయం సమకూరుతున్నా.. అది ఎటు వెళుతుందో చెప్పాలని రఘురామక్రిష్ణంరాజు డిమాండ్ చేశారు.

