Yogi Adityanath Support Raja Singh: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పరిస్థితి ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. తెలంగాణలో బిజెపి అధ్యక్షుడిగా రామచంద్రరావు కొనసాగుతున్నప్పటికీ.. బండి సంజయ్ కాలంలో ఉన్నంత ఊపు కనిపించడం లేదు. ఎంపీలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా క్లాస్ కూడా పీకారు. స్వయంగా నరేంద్ర మోడీ రంగంలోకి దిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఎంపీల పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు ఏ స్థాయిలో సత్తా చూపించారో అందరికీ తెలుసు. పార్టీ నాయకత్వం పట్టించుకోకపోయినప్పటికీ, పార్టీ మీద అభిమానంతో చాలామంది పోటీ చేసి.. అటు గులాబీ పార్టీని, ఇటు అధికారి కాంగ్రెస్ పార్టీని తట్టుకొని నిలబడ్డారు. పార్టీ పరువును నిలబెట్టారు.
ఇప్పుడు ఇక తెలంగాణలో బిజెపికి సంబంధించి ఓ ఎమ్మెల్యే వ్యవహారం చర్చలోకి వచ్చింది. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు గోషామహల్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజసింగ్. గో రక్షకుడిగా పేరు తెచ్చుకున్న రాజాసింగ్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అంతే స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. కరుడుగట్టిన హిందుత్వ వ్యక్తిగా రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడు. దూకుడుగా మాట్లాడే తత్వం వల్ల పార్టీ నుంచి అతడు గతంలో సస్పెండ్ అయ్యాడు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు సస్పెన్షన్ ఎత్తివేసింది బిజెపి నాయకత్వం. ఆ తర్వాత అతనికి టికెట్ కూడా కేటాయించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రాజాసింగ్.. గోషామహల్ నియోజకవర్గం లో కాషాయ జెండాను రెపరెపలాడించారు. అయితే ఇప్పుడు కూడా ఆయన పార్టీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉంటానని సంకేతాలు ఇచ్చారు. రాష్ట్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది.
సస్పెండ్ చేసినప్పటికీ రాజాసింగ్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పైగా తన మాటలకు కట్టుబడి ఉంటారని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఆయన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ద్వారా మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ద్వారా మళ్లీ బిజెపిలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. గతంలో ఒకసారి ఇలానే రాజసింగ్ సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో.. మళ్లీ ఆయనను పార్టీలో చేర్చుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
యోగి ఆదిత్యనాథ్ ద్వారా మంతనాలు జరుపుతున్న నేపథ్యంలో రాజాసింగ్ కు లైన్ క్లియర్ అవుతుందని ఆయన అనుచరులు అంటున్నారు. రాజాసింగ్ వ్యవహార శైలిపై రామచంద్రరావు అంత అనుకూలంగా లేడని ప్రచార జరుగుతుంది. పైగా పార్టీలోని అంతర్గత విషయాలను రాజాసింగ్ బయట పెట్టడం వల్ల రామచంద్రరావు అప్పట్లో తీవ్రంగా కలత చెందారని వార్తలు వచ్చాయి. అలాంటప్పుడు రాజాసింగ్ ను పార్టీలో చేర్చుకొని ఇబ్బంది పడే దానికంటే.. చేర్చుకోకుండా ఉండడమే ఉత్తమం అని రామచంద్ర రావు భావిస్తున్నట్టు కొన్ని మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాజాసింగ్ తన పునరాగమనం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు.