Kolleru Black Dried Fish: కొవ్వు ఉండదు. ఎంత తిన్నా సరే లావు అవుతామని ఇబ్బంది ఉండదు. పైగా ఫ్రై చేసుకోవచ్చు. పులుసు కూడా పెట్టుకోవచ్చు. ఎలా తిన్నా సరే నాలుక సంతృప్తి పడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎలా ఉన్నాయి దీని విశిష్టతలు. ఇంతకీ ఈ నాన్ వెజ్ ఐటమ్ పేరు కొల్లేరు నల్లజాతి ఎండు చేప.
రెండు తెలుగు రాష్ట్రాలలో మంచినీటి సరస్సుగా పేరుపొందిన కొల్లేరులో ఎన్నో రకాల చేపలు లభిస్తుంటాయి. అందులో ప్రధానమైనది నల్లజాతి చేప. ఇది పచ్చిగా ఉన్నప్పుడు వండుకుని తింటే ఎంత బాగుంటుందో.. ఎండబెట్టిన తర్వాత ఎండు చేపగా వండుకుంటే కూడా అంతకుమించిన రుచి ఉంటుంది. అందువల్లే కొల్లేరు లో నల్ల జాతి ఎండు చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ చేపలు తాడేపల్లిగూడెం, విజయవాడ మార్కెట్లోకి వస్తుంటాయి. ఆ తర్వాత అక్కడ నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. కొల్లేరులో 90 రకాల చేపలు ఉంటాయి. కరోనా సమయంలో గిరాకి లేకపోవడంతో ఈ చేపలను ఎండబెట్టేవారు. అది కాస్త జీవనోపాధిగా మారింది. ప్రస్తుతం కైకలూరు, మండవల్లి పదిరిపల్లిగూడెం, శృంగవరప్పాడు, పెను మాకలంక గ్రామాల్లో ఉన్న 200 కుటుంబాలు ఈ ఎండు చేపల మీద ఆధార పడి బతుకుతున్నాయి.
పచ్చిగా ఉంటే 400.. ఎండితే అంతకుమించి
సాధారణంగా కొర్రమీను లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ చేపలు పచ్చిగా ఉంటే కిలో ధర 400 వరకు ఉంటుంది. అయితే ఈ చేపలను ఎండబెడితే.. వాటి ధర ఏకంగా 800 వరకు ఉంటుంది. ఇదే సూత్రాన్ని ఈ ప్రాంత మత్స్యకారులు అవలంబిస్తున్నారు. కొర్ర మీను మాత్రమే కాకుండా, నాటు గురక, ఇంగిలాయి, బొమ్మిడాయిలు, జల్లలు, వాలుగా వంటి పలు రకాలుకు చెందిన చేపలకి కూడా విపరీతంగా గిరాకీ ఉంటుంది. వీటిని కిలో 150 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. కొల్లేరులో లభించే చిన్న రొయ్యలను ఎండబెట్టి అమ్ముతుంటారు. కొల్లేరులో తిలాపి గురుక, చేదు బెత్తు వంటి చేపలను సైతం ఎండబెట్టి ప్రజల మేతగా వేస్తుంటారు. ప్రతి ఏడాది 30 టన్నుల పెద్ద చేపలను, 60 రకాల చిన్న చేపలను ఎగమతి చేస్తుంటారు. తద్వారా ఐదు కోట్ల వరకు ఆదాయాన్ని సంపాదిస్తుంటారు ఇక్కడి మత్స్యకారులు.
ఇక్కడ చేపలను ఎండబెట్టే విధానంలో రసాయనాలను ఉపయోగించరు. కేవలం పురాతన పద్ధతులను మాత్రమే పాటించి ఆరబెడుతున్నారు. ఉప్పు, పసుపు, దంచిన కారం కలిపి వాటిని ఎండబెడతారు. సహజ సిద్ధంగా ఎండబెడతారు కాబట్టి వాటి రుచి కూడా అద్భుతంగా ఉంటుందని కొనుగోలు చేసిన వారు చెబుతుంటారు. వేసవి ఉండే మూడు నెలలు మాత్రం వీరికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
ఈ ఎండు చేపలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు ఏ, డీ, బీ12, కే, జింక్, పాస్పరస్, అయోడిన్, కాల్షియం, రాగి వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఎముకల దృఢత్వం, గుండె పనితీరు, మెదడు అభివృద్ధి, కండరాల నిర్మాణం, చెడు కొవ్వుల తొలగింపు సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.