Uttar Pradesh Assembly elections 2022 : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అన్నింటికంటే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో గెలుపు ఎవరిది అన్నది ఆసక్తి రేపుతోంది. ఉత్తరప్రదేశ్ ను కంచుకోటగా మార్చుకున్న బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందా..? అనే సందేహాలు నిన్నటి వరకు వ్యక్తమయ్యాయి. అయితే బీజేపీ నుంచి వరుసగా వలసల పర్వం కొనసాగుతుండడంతో ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావడంతో పాటు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా జీ న్యూస్ అతిపెద్ద ఓపినియన్ పోల్ నిర్వహించింది. డిసైన్డ్ బాక్డ్స్ సంస్థతో కలిసి చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. యూపీలో మరోసారి యోగి సీఎం కానున్నాడని సంచలన విషయం తెలిపింది.
పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా తో పాటు ఉత్తరప్రదేశ్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మిగతా రాష్ట్రాల కంటే యూపీ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అతిపెద్ద రాష్ట్రంతో పాటు అత్యధిక అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు కలిగిన ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల భవితవ్యాన్ని తెలుపుతాయని అంటుంటారు. అందుకే ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇందులో భాగంగా ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి పాగా వేసేందుకు రకరకాల ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రధానమంత్రి మోడా స్వయంగా ఇక్కడ పర్యటించి కార్యకర్తల్తో ఉత్తేజాన్ని నింపారు.
Also Read: విపరీతంగా పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే? దేశంలో థర్డ్ వేవ్ తప్పదా?
ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి వరుసగా ఎస్పీలోకి వలసలు వెళ్లడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక దశలో యోగి సర్కార్ వచ్చే ఎన్నికల్లో దిగిపోనుందా..? అనే కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా జీ న్యూస్ చేపట్టిన ఓపినియన్ పోల్ లో మరోసారి బీజేపీ అధికారం చేపట్టనుందని తేలింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టునున్నారని, ఎస్పీ రెండో ప్లేసులోకి వస్తుందని తెలిపింది. అయితే ఈ అభిప్రాయ సేకరణనను డిజైన్ బాక్స్డ్ తో కలిసి నిర్వహించింది. ఐదు రాష్ట్రాల ప్రజల నుంచి 10 లక్షలకు పైగా స్పందనలు వచ్చాయి. జీ న్యూస్ ఒపినియన్ పోల్ లో 72 శాతం ప్రజలు ఇష్టపడుతున్నారని తెలిపింది.
జీ న్యూస్ సర్వే ప్రకారం.. ఉత్తప్రదేశ్లో పోల్ విషయానికొస్తే మొత్తం ప్రతివాదులలో 47 శాతం మంది ఆదిత్యానాథ్ వైపు మొగ్గు చూపారు. 35 శాతం మంది ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ను కోరుకుంటున్నారు. 9 శాతం మంది మాయావతికి అనుకూలంగా ఓటు వేశారు. 5 శాతం మంది ప్రియాంకా గాంధీ తదితరులను యూపీ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం 41 శాతం ఓట్లతో రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే సమాజ్ వాదీ పార్టీకి 34 శాతం ఓట్లు పడుతాయని పేర్కొంది. ఇక బీఎస్పీకి 10 శాతం, కాంగ్రెస్ కు కేవలం 6 శాతం ఓట్లు పడుతాయని తెలిపింది.
ఇంకా బీజేపీకి రాష్ట్రవ్యాప్తంగా 245 నుంచి 267 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఎస్పీకి 125 నుంచి 148 సీట్లు వస్తాయని పేర్కొంది. మాయావతికి చెందిన పార్టీ 5 నుంచి 9 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని తెలిపింది. కాంగ్రెస్ 3 నుంచి 7 సీట్లకే పరిమితం కానుందని జీ న్యూస్ తెలిపింది. కాగా 2017 ఎన్నికల్లో బుందేల్ ఖండ్ ప్రాంతంలో బీజేపీ మొత్తం 19 స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి అక్కడ 1 నుంచి 2 సీట్లు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో మరోసారి యోగి సర్కార్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని జీ న్యూస్ తెలిపింది.