ఇండియాకు మరోసారి వార్నింగ్ ఇచ్చింది అగ్రరాజ్యం అమెరికా. రష్యాతో ఇండియా చేసుకున్న ఎస్-400 రక్షణ వ్యవస్థ కొనుగోలు డీల్‌పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డీల్‌పై ముందుకు వెళ్లాలని నిర్ణయిస్తే ఇండియాపై ఆంక్షలు తప్పవని యూఎస్ కాంగ్రెషనల్ రిపోర్ట్ హెచ్చరించింది. అక్కడి కాంగ్రెస్‌కు రిపోర్ట్ చేసే ది కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) ఈ నివేదికను రూపొందించింది. ఇదొక స్వతంత్ర సంస్థ కావడం గమనార్హం. ఈ సంస్థే ఇప్పుడు ఇండియాపై ఆంక్షలు విధించాలని సూచిస్తోంది.
Also Read: దేశీ వ్యాక్సిన్లు నీళ్లతో సమానమట..: అప్పుడే బడా కంపెనీల నెగెటివ్ ప్రచారం
రష్యా నుంచి ఇండియా ఎస్-400 రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడం అనేది.. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్ కింద ఇండియాపై అమెరికా ఆంక్షలకు కారణమవుతుందని సీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఈ సీఆర్ఎస్ ఇచ్చింది అధికారిక నివేదిక కాకపోయినా.. దీని ఆధారంగా అమెరికా చట్ట సభల ప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే వీలు కలుగుతుంది.
ఇండియా, రష్యా 2018, అక్టోబర్‌లో 500 కోట్ల డాలర్ల విలువైన ఎస్-400 మిస్సైల్ రక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఐదు మిస్సైల్ రక్షణ వ్యవస్థలను రష్యా.. ఇండియాకు అందించనుంది. అమెరికా మొదటి నుంచీ హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఈ డీల్‌పై ముందుకే వెళ్లాలని ఇండియా నిర్ణయించింది. ఇప్పటికే రష్యాతో ఇదే డీల్ కుదుర్చుకున్న టర్కీపై అమెరికా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
Also Read: బీజేపీలో చేరేందుకు సినీ గ్లామర్ల క్యూ
అమెరికా పేట్రియాట్, థాడ్ రక్షణ వ్యవస్థలను ఇవ్వజూపినా భారత్.. రష్యా నుంచి ఎస్ 400 కొనుగోలుకే మొగ్గుచూపింది. ఎస్ 400 ప్రపంచంలోనే ఎదురులేని రక్షణ వ్యవస్థ. బహుళవిధ రాడార్, శత్రు విమానాలను స్వయంగా పసిగట్టి ఎదురుదాడి చేసే యంత్రాంగం, విమాన విధ్వంసక క్షిపణులు, నియంత్రణ కేంద్రం ఎస్ 400 వ్యవస్థలో అంతర్భాగాలు. ఈ వ్యవస్థ మూడు రకాల క్షిపణులను ప్రయోగించగలదు. శత్రు విమానాలను, పైలట్ రహిత యూఏవీలను, క్షిపణులను ఎస్ 400 నేలకూల్చేస్తుంది. శత్రు విమానాలు, క్షిపణులు 30 కిలోమీటర్ల ఎత్తున, 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే పసిగట్టి ఎదురుదాడికి దిగగలవు. ఇది ఏకకాలంలో 30 శత్రు విమానాలను, యూఏవీలను, క్షిపణులను ఎదుర్కోగలదు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్