UP Election Results 2024 : గత పార్లమెంటు ఎన్నికల్లో 80 స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ లో.. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 69 స్థానాల్లో విజయం సాధించారు. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ విహారం ప్రధానంగా ఉన్నది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమే. అయితే ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి ఒకసారి గా మారిపోయింది. అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ కూటమి పుంజుకుంది. ఉత్తర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న బిజెపి కంటే ఐదు సీట్లు అదనంగా గెలుచుకుంది. వాస్తవానికి గత ఎన్నికల్లో 69 స్థానాలతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారతీయ జనతా పార్టీ 37 స్థానాలకు పరిమితం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. దాదాపు 32 స్థానాలను ఆ పార్టీ కోల్పోయింది. ఆ రాష్ట్రంలో యోగి తన మార్క్ పరిపాలన సాగిస్తున్నప్పటికీ ఎక్కడ తేడా కొట్టిందో అర్థం కావడం లేదని బిజెపి నాయకులు అంటున్నారు..
అయితే ఈసారి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించింది. ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో వినూత్నంగా ప్రచారం సాగించింది. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రియాంక గాంధీ కాలికి బలపం కట్టుకుని తిరిగారు.. పార్టీ శ్రేణులను ఏకం చేశారు. స్థానికుల సమస్యలను ప్రియాంక ఆసక్తిగా విన్నారు. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. ఆమెథి, రాయ్ బరేలి నియోజకవర్గాలలో ఓటర్లను నేరుగా కలిశారు. వారితో మాటామంతి కలిపారు..” నేను మీ సోదరిణి, మీ కుమార్తె లాంటి దానిని.. మిమ్మల్ని అర్థం చేసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను. మీ సమస్యలను అవగతం చేసుకునేందుకే ఇంత దూరం ప్రయాణించాను.. మీకు, నాకు పేగు బంధం ఉంది. అదే ఇక్కడ దాకా తీసుకొచ్చిందని” ప్రియాంక గాంధీ ఇలాంటి ప్రసంగాలు చేయడం అక్కడి మహిళలను కదిలించింది. పైగా అక్కడి మహిళలతో ఆమె బృందాలుగా సమావేశాలు నిర్వహించింది. అది ఓటర్లను ఆలోచింపజేసింది.. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి ఉత్తర్ ప్రదేశ్ లో ఆ స్థాయిలో స్థానాలు సాధ్యమయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం మహిళలే లక్ష్యంగా సాగింది. అందుకే కాంగ్రెస్ పార్టీ కూటమికి ఈసారి ఆ రాష్ట్రంలో ఎక్కువగా సీట్లు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అనేక గ్రామాలలో ప్రియాంక గాంధీ పర్యటించారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించారు. యువజన బాలికలతో తరచుగా సమావేశం అయ్యేవారు. వారి సమస్యలు తెలుసుకునేవారు. వారితో సంప్రదాయ నృత్యాలు చేసేవారు. అందువల్లే రాయబరేలి, అమేథి స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. “ప్రియాంక గాంధీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. బిజెపి నాయకులు గెలుస్తామన్న దీమా లో ఉన్నారు. అన్నింటికీ మించి ప్రియాంక గాంధీ ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు. అప్పటికప్పుడు వారితో మాట్లాడటం, వారికి అర్థమయ్యే విధంగా తిరిగి సమాధానం చెప్పడం ఓటర్లకు కొత్తగా అనిపించింది. అందువల్లే యూపీ హస్త గతమైందని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే హస్తం హవా ఇక్కడితోనే ఆగుతుందా.. యూపీ రాష్ట్రంలో మరింత విస్తరిస్తుందా? అనేది కాలం గడిస్తే చెప్పలేమని రాజకీయ మేధావులు చెబుతున్నారు.