PM Modi : బీజేపీకి ఎందుకు సీట్లు తగ్గినట్టు? మోడీ చేసిన తప్పులేంటి?

సుదీర్ఘకాలం తమకు సేవలందించిన నేతలను మార్చడంపై ఓటర్లు గుర్రుగా ఉన్నారు. దీనిపై లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓట్లతో నిరసన తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : June 4, 2024 9:02 pm

Narendra Modi

Follow us on

PM Modi : 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 400 సీట్లు సాధించాలన్న లక్ష్యంలో ఈ ఎన్నికల బరిలో దిగిన బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఆశించిన సీట్లు సాధించలేకపోయింది. 2019లో 303 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి భారీగా సీట్లు కోల్పోయింది. కనీసం గత ఎన్నికల సీట్లు కూడా సాధించలేదు. ఎందుకిలా జరిగింది? అందుకే ఏయే కారణాలు దోహదం చేశాయో తెలుసుకుందాం.

రిజర్వేషన్ల రద్దు..
దేశంలో ఆదివాసీలు, దళితుల జనాభా ఎక్కువ. 2014, 2019 ఎన్నికల్లో వీరంతా బీజేపీకి మద్దతుగా నిలిచారు. ఈ ఎన్నికలకు ముందు భాజపా నేత అనంత్‌ హెగ్డే తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రకటించారు. ఈ మాటలను విపక్షాలు అందుకున్నాయి. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే బీజేపీకి 400 సీట్లు కావాలంటోందని ప్రచారం చేశాయి. ఇది మారుమూల ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. తమ రిజర్వేషన్లను బీజేపీ ఎత్తేస్తుందన్న ఆందోళనతో వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాంగ్రెస్ విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టినా.. పార్టీ యంత్రాంగం దీనిని గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో విఫలమైంది.

ఫిరాయింపులతో పార్టీలపై సానుభూతి..
అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం గతంలో కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశ ప్రజలు ఆయనకు పీఠం కట్టబెట్టారు. నేటి బీజేపీ నాయకత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూల్చింది. తమకు అనుకూలంగా ఉన్నవారితో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిపోవడం ఏక్నాథ్ శిండే సీఎం కావడంపై నిరసన వ్యక్తమైనా పట్టించుకోలేదు. గతేడాది శరద్ పవార్ పార్టీ సైతం బీజేపీ చీల్చింది. ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోయారు. వీరి అసమ్మతి నిశ్శబ్దంగా ఓట్ల రూపంలో బయటపడింది.

అగ్నివీర్
దేశంలోని యువత ప్రత్యేకించి హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్.. తదితర రాష్ట్రాల్లో సైనికదళాల్లో చేరుతుంటారు. వారి ఆశలపై నీరుచల్లుతూ కేంద్రం అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

పేదలకు అనుకూలంగా ఉండాలి..
దేశంలో పేదలు ఎక్కువగా ఉన్నారు. అసలు తమకు ఎలాంటి పథకాలు ఉన్నాయో కూడా తెలియని అమాయకులు ఎంతో మంది. వీరికి రేషన్ అందుతోందా లేదా అన్న అంశంపై స్థానికంగా ఉండే భాజపా, మిత్రపక్షాల కార్యకర్తలు దృష్టిపెట్టాల్సి ఉంది. వందేభారత్ తదితర సూపర్‌ఫాస్ట్ రైళ్లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం సామాన్యుడి ఆకాంక్షలను పట్టించుకోలేదు. మధ్యతరగతి, ఉన్నత వర్గాలు సమాజంలో తక్కువ ఉంటారు. ఎన్నికల వ్యవస్థలో పాల్గొనేది పేదలే. వారికి అనుకూలంగా సంస్కరణలు ఉండాలి.

జీఎస్టీ పన్ను విధానం
జీఎస్టీ పన్ను విధానం గందరగోళంగా ఉంది. ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా సామాన్యులు వినియోగించే పలు వస్తువులపై పన్నును తగ్గించకపోవడంతో వారిపై భారం పడింది. దీన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు.

ఇండియా కూటమిని తక్కువగా అంచనా వేయడం
ఇండియా కూటమిని బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా గుర్తించలేదు. అతివిశ్వాసం ప్రదర్శించింది. మోదీ అమిత్‌షా కాంగ్రెస్‌ను, రాహుల్‌గాంధీని చులకన చేస్తూ, తమ స్థాయికి తగ్గి విమర్శలు చేశారు. 2019 ఎన్నికల తరహాలోనే ఆ కూటమి పోటీలో లేకుండా పోతుందన్న మితిమీరిన విశ్వాసంతో కూటమి చేసే విమర్శలను పట్టించుకోలేదు.

పదేళ్ల పాలన..
సహజంగా ఐదేళ్లు పాలనలో ఉంటేనే ప్రజలకు ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. విపక్షాలు కొత్త వాగ్దానాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు యత్నిస్తాయి. ప్రధాని మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ఇప్పటికే పదేళ్లు పూర్తి చేసింది. దీంతో సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇదే ప్రస్తుత ఎన్నికల్లో వ్యక్తమైంది.

సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మి..
తమిళనాడులో అన్నామలై సునామీ సృష్టిస్తాడని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఫలితాలు వచ్చేసరికి అది కేవలం బుడగేనని స్పష్టమైంది. సుదీర్ఘకాలంగా ద్రావిడ రాజకీయాలు ఉత్తరాది రాజకీయపక్షాలకు దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం సైతం అదే స్పష్టమైంది. అందుకనే నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మకుండా క్షేత్రస్థాయిలో సమీక్షించగలగాలి.

ముఖ్యమంత్రుల మార్పు..
గత డిసెంబరులో జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతర సీఎంలను బీజేపీ నాయకత్వం మార్చింది. రాజస్థాన్‌లో వసుంధరా రాజేను కాదని భజన్‌లాల్‌ శర్మను, ఛత్తీస్‌గఢ్‌లో రమణిసింగ్ స్థానంలో విష్ణుదేవ్ ను సీఎంలుగా నియమించింది. ఈ మార్పును అక్కడి నేతలు, కార్యకర్తలు ప్రశ్నించలేదు. సుదీర్ఘకాలం తమకు సేవలందించిన నేతలను మార్చడంపై ఓటర్లు గుర్రుగా ఉన్నారు. దీనిపై లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓట్లతో నిరసన తెలిపారు.