KK survey : ఆ మీడియా వల్ల కానిది.. కూటమి సునామీని కేకే సర్వే లెక్కలతో సహా చెప్పేసింది

KK survey కేకే సర్వే సంస్థ స్పష్టంగా చెప్పేసిందని ఏపీ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో విజయం సాధించిన అనంతరం కూటమి ఎమ్మెల్యేలు కేకే సర్వే గురించి ప్రముఖంగా ప్రస్తావించడం విశేషం.

Written By: NARESH, Updated On : June 4, 2024 9:44 pm

KK survey correctly predicts TDP Janasena BJP alliance win

Follow us on

KK survey : ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబీఎన్, ఈటీవీ, టీవీ -5, మహా న్యూస్.. వంటివి చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు ప్రసారం చేయవచ్చుగాక… పేజీలకు పేజీలు వార్తలు కుమ్మేయచ్చు గాక.. కానీ ప్రజానాడిని అవి ప్రతిబింబించలేవు.. స్పష్టంగా వెల్లడించలేవు.. ఇక సోషల్ మీడియా, మన్నూ మశానం కూడా ఒకటి సక్కగా చెప్పలేదు.. పేరుపొందిన సర్వే సంస్థలు అయితే ఏవో లెక్కలు చెప్పాయి గాని.. కచ్చితంగా ఈ స్థాయిలో సీట్లు వస్తాయని వివరించలేకపోయాయి. కానీ ఈ దశలో కేకే అనే ఓ సర్వే సంస్థ ఓట్ల కౌంటింగ్ కు రెండు రోజులు ఉందనగా.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఏపీలో కూటమి సునామీని సృష్టించబోతుందని స్పష్టం చేసింది. ఏకపక్ష విజయంతో అందరి నోళ్ళు మూతపడతాయని వివరించింది.. టిడిపి ఆధ్వర్యంలో కూటమి ఏకంగా 160కి సీట్లకు పైగా సాధిస్తుందని అంచనా వేసింది.

కేకే సర్వే ఆ స్థాయిలో చెప్పడంతో చాలామంది ఫేక్ అన్నారు. కొన్ని మీడియా సంస్థలయితే అలా ఎలా సాధ్యమని ప్రశ్నించాయి. ముఖ్యంగా వైసిపి గొంతుక సాక్షి టీవీ అయితే కేకే సర్వే సంస్థను తూర్పార పట్టింది. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నాడని ఆరోపించింది.. కానీ అంతిమంగా కేకే సర్వే చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమైంది. వాస్తవానికి గత ఎన్నికల్లో సిసిఎస్, విడిపి అసోసియేట్స్ వంటి సంస్థలు స్పష్టమైన ఫలితాలను వెల్లడించాయి. అయితే ఈసారి ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ ను ఆ సంస్థలు వెల్లడించలేదు. ఇక గతంలో ఆరా మస్తాన్ కూడా వైసీపీ విజయం సాధిస్తుందని ప్రకటించింది. అది వాస్తవంలో నిజమైంది కూడా. అయితే ఈసారి ఆరా మస్తాన్ కచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని కుండ బద్దలు కొట్టింది. కాకపోతే అది వాస్తవ రూపం దాల్చలేదు. ఇక హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కేకే సర్వే స్పష్టమైన ఎగ్జిట్ పోల్ ఇవ్వడంతో విస్తృతమైన చర్చ జరుగుతుంది.

175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో.. వైసీపీ కేవలం 14 సీట్ల వరకే పరిమితమవుతుందని కేకే సర్వే ఒక అంచనా వేసింది. 144 స్థానాలలో పోటీ చేసిన టిడిపి 133, జనసేన 21కి 21, బిజెపి పదికి ఏడు స్థానాలు సాధిస్తుందని కేకే సర్వే అంచనా వేసింది. అయితే ఈ అంచనాలు 95 శాతానికి పైగా వాస్తవ రూపం దాల్చాయి. టిడిపి 134, జనసేన 21, బిజెపి 8 స్థానాలు, వైసిపికి పది స్థానాల్లో లభించడం విశేషం. కేకే సర్వే చెప్పినట్టుగా ఫలితాలు దగ్గరగా ఉండడంతో.. ఆ సంస్థ విశ్వసనీయతపై జోరుగా చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయి సంస్థలు కూడా అంచనా వేయలేనిది.. కేకే సర్వే సంస్థ స్పష్టంగా చెప్పేసిందని ఏపీ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీలో విజయం సాధించిన అనంతరం కూటమి ఎమ్మెల్యేలు కేకే సర్వే గురించి ప్రముఖంగా ప్రస్తావించడం విశేషం.