Amit Shah left Telangana tour for Modi : ఇకనుంచి ప్రతి నెలలో రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పక్కకు తప్పుకున్నారు.. అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం.. భారతీయ జనతా పార్టీలో ఒకటి, రెండో నెంబర్ గా కొనసాగుతున్న వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు తప్పుకోవడం పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. కానీ ఆ తప్పుకున్న ప్రాంతం తెలంగాణ కావడం ఆశ్చర్యకరం.

తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి నాయకులు తెగ తాపత్రయపడుతున్నారు.. ఇందులో భాగంగా అధికార భారత రాష్ట్ర సమితి పై నిప్పులు చెరుగుతున్నారు.. ఏ మాత్రం అవకాశం లభించినా ధ్వజం ఎత్తేందుకు వెనుకాడటం లేదు. క్రమంలో పార్టీలో ఉన్న కొన్ని లొసుగులను సరి చేసేందుకు తాను ప్రతి నెలలో తెలంగాణకు వస్తానని అమిత్ షా అప్పట్లో హామీ ఇచ్చారు.. అందుకు తగ్గట్టుగానే తన ఫోకస్ తెలంగాణ మీద మరింతగా కేంద్రీకరించారు.. అంతేకాదు ఇతర పార్టీల నుంచి నాయకులు చేర్చుకునేందుకు ఏకంగా చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన బాధ్యతలను హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అప్పగించారు.. అప్పటినుంచి ఆయన ఈ పని చేసుకుంటూ పోతున్నారు.. కానీ బిజెపి అనుకున్నంత సులభంగా చేరికలు జరగడం లేదు.. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేరుతారని ఆశించినప్పటికీ ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
పక్కకు తప్పుకున్నారు
వాస్తవానికి ఈనెల 28, 29 తేదీల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే 13న నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో అమిత్ షా తన పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆయన పర్యటన వచ్చే నెలకు వాయిదా పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో అమిత్ షా పర్యటిస్తారని తెలుస్తోంది.. ఇక 13న రాష్ట్రంలో పర్యటించే మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తారు.
ముందుగానే కేంద్ర మంత్రులు
వచ్చేనెల 13న ప్రధానమంత్రి మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు ముందుగానే రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నుంచి వారు ఈ క్రతువుకు శ్రీకారం చుట్టానున్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బి ఎల్ వర్మ ఆదివారం వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. కేంద్ర రాష్ట్ర సామర్థక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ఆదివారం నుంచి మూడు రోజులపాటు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం లో, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద జోషి 23, 24 తేదీల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం లో పర్యటిస్తారు.. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా ఆదివారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి గిరిజనుల ఆరాధ్య దైవమైన ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా జాతరకు హాజరవుతారు.. మరోవైపు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని భారతమాత మహా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు.
తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యేందుకు
తెలంగాణ గడ్డపై కాషాయ దళం కార్యక్రమాలు ముమ్మరం కాబోతున్నాయి. కేంద్ర మంత్రులు, జాతీయ నేతల విస్తృత పర్యటనలు, మరోవైపు ర్యాలీలు, వీధి సమావేశాలతో ప్రజానీకానికి చేరువయ్యేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా ఎక్కువసార్లు పర్యటనలు చేపట్టే అవకాశం కల్పిస్తోంది.. వీరికి తోడు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నాయకులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు.. మరోవైపు పార్టీ రాష్ట్ర కేడర్ కు జాతీయ నాయకులు ఊపిరి సలపని కార్యక్రమాలను నిర్దేశించారు. ఈనెల 24న మహబూబ్నగర్ లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇందుకు అనుగుణంగా కార్యక్రమాలను వెల్లడించే అవకాశం కల్పిస్తోంది..వచ్చే మూడు నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో రెండు చొప్పున 15 రోజులపాటు 9000 విధి సమావేశాలు నిర్వహించబోతున్నారు. మార్చి 5 నుంచి 15 రోజులపాటు మండలం యూనిట్ గా బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.