ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే ఐక్య రాజ్య సమితిలో 13ఏళ్ల బాలికకు ఓ అరుదైన అవకాశం దక్కింది. తమిళనాడుకు చెందిన నేత్రా మోహన్ దాస్(13) ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్ గా ఎంపికవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పేదరికాన్ని నిర్మూలించే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మెహన్ దాస్ ను గుడ్ విల్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ఐరాస అనుబంధ సంస్థ UNADAP వెల్లడించింది. దీంతో ఆమెకు ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే అరుదైన అవకాశం లభించనుంది. దేశ విదేశాల నాయకులు, విద్యావేత్తలు, రాజకీయ నేతలు, సాధారణ ప్రజలు పేదలకు సాయం చేసేలా మోహన్ దాస్ ప్రసంగం ఉండనుంది.
నేత్రా మోహన్ దాస్ తండ్రి మోహన్ తమిళనాడుకు చెందిన ఓ బార్బర్, అతను బార్బర్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. దేశంలో కరోనా పరిస్థితులను చూసి చలించిన మోహన్ తన కుమార్తె చదువు కోసం కూడబెట్టిన రూ.5లక్షలు పేదలకు సాయం చేసేందుకు వినియోగించాడు. కూతురును సివిల్స్ చదివించేందుకు ఉపయోగించాల్సిన డబ్బులను పేదల కడుపులు నింపేందుకు ఉపయోగించడంపై పలువురు ఆయనను ప్రశంసించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మన్ కీ బాత్ లో నేత్రా గురించి ప్రజలకు తెలియజేసి అభినందించారు.
తాజాగా మోహన్ దాస్ ఐరాస గుడ్ విల్ అంబాసిడర్ ఎంపికవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆమెకు ఈ అవకాశం దక్కింది. మోహన్ దాస్ త్యాగాన్ని గుర్తించిన డిక్సన్ స్కాలర్‌షిప్ ఆమెకు రూ.లక్ష స్కాలర్‌షిప్ ప్రకటించింది. ఐరాస గుడ్ విల్ అంబాసిడర్ గా మోహన్ దాస్ ఎంపికవడంతో ఆమెకు ఐరాస అసెంబ్లీ జనరల్ లో ప్రసంగించే అరుదైన అవకాశం దక్కనుంది.