గత రెండు మూడ్రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా, టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల మీరా చోప్రా నెటిజన్లతో ట్వీటర్లో లైవ్ చాట్ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. మీకు తెలుగులో ఏ హీరో అంటే ఇష్టమని ఓ నెటిజన్ అడుగగా తనకు మహేష్ అంటే ఇష్టమని చెప్పింది. అలాగే ఓ నెటిజన్ ఎన్టీఆర్ గురించి అడుగగా తనకు ఎన్టీఆర్ కంటే మహేష్ ఇష్టమని చెప్పింది. తమ అభిమాన హీరో పేరు చెప్పకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తనతోపాటు తల్లిదండ్రులను వ్యక్తిగత దూషించడంతో మీరాచోప్రా మానస్థాపం చెంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనపై అసభ్యంగా పెట్టిన కామెంట్లను స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ఆన్ లైన్లో కంప్లైంట్ చేసింది. అంతేకాకుండా ‘ఎన్టీఆర్ మీరు ఇలాంటి ఫ్యాన్స్ తో విజయవంతం అయ్యారా?’ అంటూ ఎన్టీఆర్ కు ట్వీట్ చేసింది. మీరు ఈ విషయంలో స్పందిస్తారని అనుకుంటున్నా.. అని మీరాచోప్రా ఎన్టీఆర్ కు ట్వీట్ చేసింది. అయితే ఈ ఇష్యూలో ఎన్టీఆర్ సైలంట్ అయ్యారు. ఆమె ట్వీట్ కు ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన కామెంట్లను సీరియస్ గా తీసుకున్న మీరాచోప్రా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవితకు కూడా ట్వీట్ చేసింది. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీ శిశు శాఖ మంత్రికి ట్వీట్ చేసింది. ఈ వివాదంపై ఇప్పటికే మహిళా కమిషన్ ఎంట్రీ అవ్వడంతో వివాదం ముదిరిపోయింది.
తాజాగా మీరా చోప్రా ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా చట్ట ప్రకారం నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కు ఆదేశించినట్లు కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే మీరా చోప్రా చేసిన ట్వీట్స్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు సెక్షన్ 67ఐటీ యాక్ట్, 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మీరాచోప్రాపై అసభ్యంగా కామెంట్స్ చేసినవారి ట్విటర్ అకౌంట్స్, షేర్ చేసిన పోలీసులు గుర్తిస్తున్నారు. వీరిపై కేసులు నమోదుచేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు. అయితే ఈ ఇష్యూపై ఇప్పటివరకు ఎన్టీఆర్ స్పందించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ట్వీటర్లో స్పందించి తన అభిమానులకు ఏదైనా సందేశం ఇస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!