https://oktelugu.com/

Telangana BJP: బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్ లోకి ఇద్దరు బీజేపీ అగ్రనేతలు

ఈసారి లోక్‌సభ ఎన్నికలు నెల ముందే రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ కూడా లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 26, 2023 / 03:10 PM IST
    Follow us on

    Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. 64 స్థానాల్లో కాంగ్రెస్‌ ఒకస్థానంలో మిత్రపక్షం సీపీఐ గెలిచింది. డిసెంబర్‌ 7న తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరింది. ఈ క్రమంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ 10 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లోని కొంతమంది నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు.

    పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీల సమాయత్తం..
    ఈసారి లోక్‌సభ ఎన్నికలు నెల ముందే రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ కూడా లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో బీజేపీ కీలక సమావేశం డిసెంబర్‌ 28న కొంగరకలాన్‌లో జరుగనుంది. ఈ సమావేశానికి అమిత్‌షా హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమి కూడా పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాహుల్‌గాంధీ రెండో విడత భారత్‌ జోడోయాత్రకు సిద్ధమవుతున్నారు.

    కాంగ్రెస్‌లోకి ఇద్దరు బీజేపీ నేతలు..
    లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో త్వరలో పార్టీ ఫిరాయింపులు చోటుచేసుకుంటాయన్న వార్తలతో బీజేపీ ఉలిక్కిపడింది. ఒక సిట్టింగ్‌ ఎంపీ, మాజీ ఎంపీ గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌కు విధేయత చూపే అవకాశం ఉంది. వీరిద్దరూ తమ సొంత నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులుగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మాజీ ఎంపీ కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా కలిసినట్లు సమాచారం.

    మంత్రి పదవి ఇవ్వలేదని..
    ఇక సిట్టింగ్‌ ఎంపీ ఇటీవల కేంద్ర క్యాబినెట్‌లో స్థానం దక్కుతుందని భావించాడు. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం అందుకు నిరాకరించింది. దీంతో అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న సదరు ఎంపీ లోక్‌సభ ఎన్నికల ముందు పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిచారు. కానీ ఎమ్మెల్యే టికెట్‌కు కాంగ్రెస్‌ నిరాకరించడంతో చేరిక ఆగిపోయింది. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. ఈమేరకు అతని సన్నిహితుడు రేవంత్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

    ఈ ఊహాగానాలు నిజమైతే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తన పనితీరును మెరుగుపరుచుకున్న తర్వాత తెలంగాణ నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికలకు ముందు గట్టి ఎదురుదెబ్బ తప్పదు.